Amaravati, August 24: ఏపీలో సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ నేతలకు కూడా కరోనా బారీన పడుతున్నారు. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా (AP Educational Minister Tests Corona Positive) నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారని.. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతున్నప్పటికీ వచ్చే నెల నుంచి విద్యాసంస్ధలు తెరిచేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా స్కూళ్లలో వసతులు, నాడు-నేడు కార్యక్రమాలపై సమీక్షలు, పర్యటనలతో సురేష్ (Adimulapu Suresh) బిజీగా ఉన్నారు.
విద్యామంత్రి ఆదిమూలపు సురేష్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఈ నెల 19న జరిగిన కేబినెట్ భేటీకి ఆయనతో పాటు హాజరైన పలువురు మంత్రుల్లో ఆందోళన మొదలైంది. కరోనా లక్షణాలతోనే ఆయన కేబినెట్‌కు హాజరు కావడంతో ఇప్పుడు ఆయన నుంచి ఎవరికైనా వైరస్ సోకిందేమోనని అధికారులు ఆరా తీస్తున్నారు. సురేష్ తో సమీక్షలకు హాజరైన విద్యాశాఖ అధికారులు కూడా ఇప్పుడు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 7,895 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 3,53,111కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 3282కు పెరిగిన కరోనా మరణాలు
ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది కోలుకోగా, ఇంకొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కరణం బలరాం, గోపిరెడ్డి శ్రీనివాస్‌లు మరికొందరు ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడ్డారు.