Vjy, June 3: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించనున్నట్టు వెల్లడించారు. సీఈవో ముఖేష్ కుమార్ మీనా సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఏపీలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎం బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడెంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నాం. 119 మంది పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది’ అని చెప్పారు.
కొన్ని లెక్కింపు కేంద్రాలకు స్వయంగా వెళ్లి ఏర్పాట్లు పరిశీలించాం. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8.30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా వచ్చాయి. వీటికి ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. రాష్ట్రానికి 119 మంది అబ్జర్వర్లను ఈసీ నియమించింది. ప్రతి కౌంటింగ్ హాలులో కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ప్రతి సెంటర్‌లో మీడియా రూమ్ ఏర్పాటు చేశాం. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నాం. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా బలగాలను మోహరిస్తున్నాం. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ఠ భద్రత ఉంది.
ఏపీలో మొత్తం 3.33 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారు. 26,721 మంది సర్వీసు ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశాం. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశాం.
అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం లెక్కింపునకు 27 రౌండ్లు పడుతుంది.. ఫలితాలు వచ్చేందుకు సుమారు 9 గంటల సమయం పడుతుంది. రాజమహేంద్రవరం, నరసాపురం లోక్‌సభలో 13 రౌండ్లు ఉన్నాయి.. ఇక్కడ ఫలితాలు వచ్చేందుకు సుమారు 5 గంటలు పడుతుంది. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు ఉన్నాయి. కొవ్వూరు, నరసాపురంలో 5 గంటల్లో ఫలితాలు వస్తాయి. కౌంటింగ్ ప్రక్రియను మీడియా చిత్రీకరణ చేసుకోవచ్చు. కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు అనుమతించేది లేదు. మీడియాకు మాత్రం నిర్దేశించిన వరకు ఫోన్లు తీసుకెళ్లవచ్చు’’ అని ఎంకే మీనా తెలిపారు.