ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని ముందంజలో ఉన్నారు. 4 వేలకు పైగా ఓట్ల లీడ్‌తో పవన్ దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత వెనుకంజలో ఉన్నారు. టీడీపీ 12, జనసేన 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లీడ్‌లో ఉన్నాయి. అలాగే తెనాలిలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఏపీ సీఎం జగన్ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ముందంజలో నిలిచారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, తన సమీప ప్రత్యర్థి బీటెక్ రవి కంటే జగన్ ఆధిక్యంలో నిలిచారు. మరో 12 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స, గజపతినగరంలో బొత్స అప్పలనర్సయ్య, ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యంలో నిలవగా... అనపర్తిలోనూ వైసీపీ ముందంజలో ఉంది. తిరుపతి అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో వైసీపీ లీడింగ్ లో కొనసాగుతోంది. హిందూపురం ఎంపీ స్థానంలోనూ వైసీపీ ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో దూసుకుపోతున్న కూటమి, 5,795 ఓట్లకు పైగా ఆధిక్యంలో రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైఎస్ షర్మిల కడపలో వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి రౌండ్ లో ముందంజలో ఉన్న షర్మిల.. రెండో రౌండ్ కు వచ్చేసరికి వెనుకబడ్డారు. షర్మిల ప్రత్యర్థి, వైసీపీ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ ముగిసే సరికి 2274 ఓట్ల లీడ్ లో ఉన్నారు. కడప రాజకీయమంతా వైఎస్ వివేకానందారెడ్డి హత్య చుట్టే సాగింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వడం సహించలేక తాను కడప నుంచి బరిలోకి దిగుతున్నట్లు షర్మిల ప్రకటించారు. వివేకా కూతురు వైఎస్ సునీత కూడా తన సోదరి షర్మిలకు మద్దతు పలికారు. కడప ఎంపీగా గెలిపించాలని ప్రజలను ఆమె అభ్యర్థించారు.
మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్, చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్, తిరువూరులో టీడీపీ అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాసరావు, పొన్నూరులో టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర, విజయవాడ (సెంట్రల్)లో టీడీపీ అభ్యర్థి బొండా ఉమ, విజయవాడ (పశ్చిమ)లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 2,760 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాజమండ్రి అర్బన్ లో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ముందంజలో ఉన్నారు.పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ముందంజలో ఉన్నారు.