Amaravati,Sep 5: ఏపీలో వ్యవసాయ విద్యుత్‌కు (Free Electricity in AP) నగదు బదిలీపై ఎలాంటి అనుమానాలకు తావులేదని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగదని ఏపీ రాష్ట్ర ఇంధనశాఖ (Andhra Pradesh Energy Department) స్పష్టం చేసింది. రైతుల ప్రయోజనాలను కాపాడటం, ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వతం చేసేందుకు నగదు బదిలీ తోడ్పడుతుందని ఇంధనశాఖ ( Energy Department) పేర్కొంది. నగదు బదిలీపై వ్యక్తమవుతున్న సందేహాలను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి సమగ్రంగా నివృత్తి చేశారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్తు రైతులకు అందుతోందని తెలిపారు. 2019 వరకు కేవలం 58 శాతం ఫీడర్లే 9 గంటల విద్యుత్ ఇవ్వగలిగే స్థాయిలో ఉండేవి. వీటి బలోపేతం కోసం ప్రభుత్వం రూ.1,700 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్‌లోనే 89 శాతం ఫీడర్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందుతోంది. రబీ నాటికి అన్ని ఫీడర్లు సిద్ధమవుతాయని ఆయన తెలిపారు.
ఉచిత విద్యుత్‌కు మరో 30 ఏళ్లు ఢోకా లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని దీనికోసం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు చేపడుతోందని అన్నారు. 31.3.2019 నాటికి ఉన్న బకాయిల్లో రూ. 8655 కోట్లు, 2019–20లో ప్రభుత్వం చెల్లించింది. 2014–19 మధ్య కాలంలో ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన బకాయిలు మొత్తం రూ.7,172 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంచేందుకు 7,523 మంది జూనియర్ లైన్‌మెన్‌లను ప్రభుత్వం నియమించింది. సాగు అవసరాలకు విద్యుత్ సరఫరా చేసే 11 కేవీ ఫీడర్లలో అంతరాయాలు 2018–19తో పోలిస్తే 2019–20లో 38.4 శాతం మేర తగ్గాయని శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. జూదం లాంటి ఆన్‌లైన్ గేమ్స్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం
మీటర్లు అమరిస్తే ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో తెలుస్తుంది. ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుందో అర్థమవుతుంది. రైతులే డిస్కమ్‌లకు చెల్లిస్తారు కాబట్టి నిలదీసి మెరుగైన సేవలు పొందవచ్చు. డిస్కమ్‌లు ఇప్పటివరకు వార్షిక నష్టాలన్నీ రైతుల ఖాతాలో వేస్తున్నాయి. మీటర్లు అమరిస్తే వినియోగం, వృధా తెలుస్తుంది. వీటికయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మరమ్మతుల ఖర్చు డిస్కమ్‌లే చూసుకుంటాయని ఇంధన శాఖ స్పష్టం చేసింది. అన్నదాతల అకౌంట్లోకే విద్యుత్ సబ్సిడీ మొత్తం, ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతుల అజమాయిషీ పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు
ఉచిత విద్యుత్తు కనెక్షన్లు తగ్గిస్తారని, పరిమితులు విధిస్తారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఒక్క విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించరు. నగదు బదిలీ ఆలస్యమైతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తారన్న ప్రచారంలోనూ నిజం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సరఫరా ఆపవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. అనధికార కనెక్షన్‌లన్నీ క్రమబద్ధీకరిస్తారు. అదనపు లోడ్ కనెక్షన్ల్ల క్రమబద్ధీకరణ కూడా చేస్తున్నాం. కౌలు రైతులు ఎలా సాగు చేస్తున్నారో అలాగే ఇకపై కూడా ఉచిత విద్యుత్ పొందుతూ సాగు చేసుకోవచ్చని శ్రీకాంత్ తెలిపారు.
రైతులపై ఒక్క రూపాయి భారం పడినా మంత్రి పదవికి రాజీనామా: బాలినేని
ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నట్లుగా ఉచిత విద్యుత్‌కు సంబంధించి రైతులపై ఒక్క రూపాయి భారం పడినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ చేశారు. బుధవారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబులా రైతులపై కాల్పులకు ఆదేశించి కన్నీరు కార్చడం తమకు చేతకాదని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నాలుగు రంగాల్లో నగదు బదిలీని తెచ్చింది. అందులో భాగంగానే విద్యుత్ శాఖలోనూ నగదు బదిలీ అమలు చేయాల్సి వస్తోందని మంత్రి తెలిపారు. రైతులపై రూపాయి కూడా భారం పడకుండా కరెంటు బిల్లులకు సంబంధించిన మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి ముందుగానే జమ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అన్నదాతలు తమ ఖాతాల్లో నగదు జమ అయిన తరువాతే బిల్లు మొత్తాన్ని డిస్కంలకు చెల్లిస్తారు. రైతులు నేరుగా బిల్లులు చెల్లించడం ద్వారా నాణ్యమైన కరెంట్ సరఫరాకోసం విద్యుత్తు శాఖ సిబ్బందిని ప్రశ్నించే వీలుంటుందని మంత్రి బాలినేని తెలిపారు.