Amaravati, Sep 2: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతన్నల అజమాయిషీ పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసింది. ఇందులో భాగంగా ఇకపై సబ్సిడీ మొత్తాన్ని (Power Subsidy) నేరుగా రైతన్నల బ్యాంకు ఖాతాల్లో ( farmers’ bank accounts ) జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు)కు రైతులు చెల్లిస్తూ వస్తున్నారు. ఇకపై ఆ బెంగ లేకుండా రైతుల ఖాతాలో జమ చేసిన తరువాతే ఆ డబ్బు డిస్కమ్‌లకు చేరుతుంది.
ఉచిత విద్యుత్తు ద్వారా వ్యవసాయదారులు ఎంత కరెంట్ వాడుకున్నా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈమేరకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ వినియోగదారులకే నగదు బదిలీ చేసే ఈ పథకం 2021 – 22 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. రైతుల జేబు నుంచి ఒక్క పైసా ఖర్చు కాకుండా, నాణ్యమైన విద్యుత్‌ను హక్కులా సాధించుకునేందుకు ఇది వీలు కల్పిస్తుందన్నారు. పక్క రాష్ట్రం నుంచి 3 మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చు
రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వడానికి కేంద్రం కొన్ని సంస్కరణలను తప్పనిసరి చేసిందని, ఇందులో భాగంగా వ్యవసాయ సబ్సిడీని ’నగదు బదిలీ’గా మార్చాలని సూచించిందని వివరించారు. అయితే ఈ నిర్ణయం రైతన్నకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా, వారిపై ఒక్క పైసా కూడా భారం పడకుండా కట్టుదిట్టమైన విధాన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఈ విధానం వల్ల రైతులకు తమకు వ్యవసాయ సబ్సిడీ ఎంత వస్తుందనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. డిస్కమ్‌లకు తానే బిల్లు చెల్లిస్తాడు కాబట్టి నాణ్యమైన విద్యుత్ కోసం నిలదీసే అధికారం ఉంటుంది. ఫలితంగా విద్యుత్ సంస్థల్లో పారదర్శకత పెరుగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 18 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులున్నారు. ఏటా 12 వేల మిలియన్ యూనిట్ల వ్యవసాయ విద్యుత్ వాడుతున్నట్లు అంచనా. గత సర్కారు ఏటా రూ. 4 వేల కోట్ల సబ్సిడీ మాత్రమే ఇవ్వగా ఇప్పుడు ఏకంగా ఏటా రూ. 8,400 కోట్ల వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ అందచేస్తూ 9 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఏపీకి తాజాగా రూ.4,881 కోట్ల మేర అదనపు ఆదాయం
వ్యవసాయ పంపుసెట్‌కు మీటర్ అమర్చి నెల నెలా వాడిన విద్యుత్‌ను లెక్కిస్తారు. అందుకయ్యే మొత్తాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం రైతు ఖాతాలో ముందుగానే జమ చేస్తుంది. ఆ తర్వాత డిస్కమ్‌లకు రైతే తన బ్యాంకు ఖాతా ద్వారా చెల్లిస్తారు. ఈ క్రమంలో రైతులపై ఒక్క పైసా భారం కూడా పడదు. ఈ ప్రక్రియ ఆలస్యమైనా అన్నదాతలకు విద్యుత్ సరఫరా నిలిపివేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అంతే కాదు మీటర్ అమర్చినప్పటికీ ఎంత విద్యుత్ వాడినా ఆ మొత్తాన్ని ప్రభుత్వమే రైతు ఖాతాలో వేస్తుంది. ఈ విషయంలో ఎలాంటి నియంత్రణ ఉండదు.
రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర విద్యుత్ సంస్థల పరిధిలో ప్రత్యేకంగా కమిటీల ద్వారా పథకాన్ని అమలు చేస్తారు. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులందరినీ పథకంలోకి తెస్తారు. అక్రమ కనెక్షన్లన్నీ క్రమబద్ధీకరిస్తారు. పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పునఃసమీక్షించనున్నారు.