Amaravati, September 4: యువతను తప్పుడు మార్గంలో నెట్టివేస్తున్న రమ్మీ, పేకాట వంటి ఆన్‌లైన్ ఆటలను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం యువతను తప్పుదోవ పట్టిస్తున్న ఆన్‌లైన్ గేమ్స్ అయినటువంటి రమ్మీ, పోకర్, ఆన్‌లైన్ జూదం, ఇతర ఆన్‌లైన్ బెట్టింగ్ లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ జూదం ఆడివారికి 6 నెలల జైలు శిక్ష మరియు నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష విధించాలని, రెండోసారి తప్పిదానికి పాల్పడితే రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది.
మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పెర్ని వెంకటరామయ్య (నాని) మీడియాకు వివరించారు. .
రైతులకు విద్యుత్ నగదు బదిలీ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలవుతుంది.
పంచాయతీ రాజ్ శాఖలో గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ పోస్టులు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్‌కు దిగువన రూ.2565 కోట్ల వ్యయంతో మరో రెండు కొత్త బ్యారేజీలు నిర్మాణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్–2 నిర్మాణ ప్రతిపాదలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాల ఆయుకట్టు స్థిరీకరణ సాగు అవసరాల కోసం రూ.15389.80 కోట్ల అంచనాలతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
రాయలసీమ ప్రాంతంలో 14 రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించిన పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
గుంటూరు జిల్లా బాపట్ల మండలం మూలపాలెం, జమ్ములపాలెం గ్రామాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 51.07 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదించింది.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 41.97 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంఘాలపై మరో ఏడాది పాటు నిషేధం పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.