Nellore, Oct 15: జమిలి ఎన్నికలపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు జరిగేట్టయితే, టీడీపీ ఇక రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని అన్నారు. ఈ లోపు టీడీపీ నేతలు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవద్దని, వారి మాటలు వినే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
చంద్రబాబు లిక్కర్ మాఫియాపై కాకాణి మాట్లాడుతూ.. లాటరీ విధానంలో వైన్‌షాప్‌ల కేటాయింపులో 90 శాతం మద్యం దుకాణాలు టీడీపీ నేతలకే దక్కాయని, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే లాటరీ ప్రక్రియ కొనసాగిందని, అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని మండిపడ్డారు. వైన్‌షాప్‌ల్లో మొత్తం ఎల్లో సిండికేట్‌దే దందా అని, రాష్ట్రంలో ఇప్పటికే ఇసుక, గ్రావెల్, విద్య, వైద్యంలో సిండికేట్స్‌దే రాజ్యం కొనసాగుతోందని, యథేచ్ఛగా దోపిడి జరుగుతోందని ఆయన తెలిపారు.
ముందస్తు ప్రణాళికలతో దోచుకోవడంతో బాబు నేర్పరి అన్న కాకాణి, చంద్రబాబు, ఎల్లో బ్యాచ్ బాగు కోసమే మద్యం పాలసీ ప్రకటించారని, ఇప్పుడు వైన్ షాప్‌ల కేటాయింపు తర్వాత అదే తేటతెల్లం అయిందని చెప్పారు. డిస్టిల్లరీలన్నీ టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఉన్నాయన్న మాజీ మంత్రి, చీప్ లిక్కర్‌ను తక్కువ ధరకు ఇస్తూ, ఇతర మద్యాన్ని ఎక్కువ ధరకు అమ్ముతారని.. నాసిరకం, పనికిరాని మద్యాన్నే తక్కువ ధరకు సరఫరా చేస్తారని చెప్పారు.
బెల్ట్ షాప్స్ కూడా పుట్టగొడుగుల్లా రాబోతున్నాయన్న ఆయన, భవిష్యత్తులో మద్యాన్ని డోర్ డెలివరి కూడా చేస్తారని అభిప్రాయపడ్డారు. లిక్కర్ పాలసీతో సీఎం చంద్రబాబుకు, కూటమి నాయకులకు కిక్కెక్కుతుందేమో కానీ, తాగేవాడికి మాత్రం కక్కు రావడం ఖాయమని స్పష్టం చేశారు. వైన్‌షాప్‌లు దక్కించుకున్నవారు సిండికేట్లుగా మారి 60–40 లెక్కల్లో వాటాలు పంచుకుంటున్నారని ఆక్షేపించారు.
లిక్కర్ షాప్‌ల కేటాయింపుల్లో సీఎం చంద్రబాబు మూడంచెల దోపిడీ విధానాన్ని అమలు చేస్తున్నారని కాకాణి దుయ్యబట్టారు. రాష్ట్ర స్థాయిలో సీఎం, నియోజకవర్గ స్థాయిల్లో ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులతో కిందిస్థాయి నాయకులు దోచుకుంటారని ఆరోపించారు. అందుకే వైన్‌షాప్‌ల డ్రా కు అవి ఎక్కడ ఉండాలనేది ప్రకటించలేదని గుర్తు చేశారు. ఇకపై మద్యం రేట్లతో పాటు, విక్రయ వేళల్ని కూడా నాయకులే నిర్ణయిస్తారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ ద్వారా వచ్చిన ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకే చేరిందన్న మాజీ మంత్రి, ఇప్పుడు టీడీపీ కూటమి పాలనలో లిక్కర్ సిండికేట్లు ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నారని ఆరోపించారు.