Andhra Pradesh Floods 2021: ఏపీలో మూడు జిల్లాల్లో వరద విలయం, ప్రమాదంలో ఉంటే పోలీస్‌ డయల్‌ 100కుగాని, 63099 13960 నెంబరుకు ఫోన్‌ చేయండి, పోలీస్‌ వాట్సాప్‌ నెంబరు 9440900005 నెంబరుకు సమాచారం ఇవ్వాలని తెలిపిన పోలీసులు
Andhra Pradesh Floods 2021 (Photo-Twitter)

Amaravati, Nov 19: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి - చెన్నై సమీపంలో జవాద్ సైక్లోన్ తీరం దాటిందని తెలిపింది. అయితే, వాయు గుండం ప్రభావంతో.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ సమీపంలో విస్తారంగాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.దీని ప్రభావంతో.. తీరంవెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. వేటకు వెళ్లకూడదని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు.

కాగా, ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకుని సహయ కార్యక్రమాలు చేపట్టాయని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్‌ కె. కన్నబాబు సూచించారు. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు (Andhra Pradesh Floods 2021), ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో చాలాచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వర్షాల ప్రభావంతో తిరుమల రెండో కనుమ రహదానికి టీటీడీ మూసివేసింది. రెండో కనుమ దారిలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మొదటి కనుమ దారిలో మాత్రమే భక్తులను అనుమతిస్తున్నది.

తీరం దాటిన వాయుగుండం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు, రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు

చిత్తూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఎప్పుడూలేని విధంగా అతిభారీ వర్షాలు (Andhra Pradesh Floods 2021) కురిశాయి. కుండపోత వర్షంతో చిత్తూరు జిల్లా అతలాకుతలమైంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శేషాచలం కొండల నుంచి వస్తున్న భారీ వరద నీటితో తిరుపతి నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు.. తిరుమల ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండు ఘాట్‌రోడ్లలో రాకపోకలు నిలిపివేశారు. నడక మార్గాలను కూడా మూసివేశారు. తిరుమల కొండల్లో నుంచి వచ్చే వరదనీరు కపిలతీర్థాన్ని ముంచెత్తింది. కొండల్లో నుంచి నీరు ఉధృతంగా వస్తుండడంతో పరిసర ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

Andhra Pradesh Floods 2021 Videos

జిల్లాలోని ఆరణియార్, కాళంగి, కృష్ణాపురం, ఎన్టీఆర్, కల్యాణి, బహుదా, పెద్దేరు జలాశయాల కు భారీగా వరద నీరు చేరింది. రిజర్వాయర్లన్నీ పూర్తిగా నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అలాగే, స్వర్ణముఖి నది, నక్కలవంక వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలం తిమ్మసముద్రం వద్ద దుప్పుటేటి కాలువ, జిల్లాలోని గార్గేయనది, బహుదా నది, బుగ్గకాలువ, కౌండిన్య నది పోటెత్తాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాల పరిధిలో రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. తిరుచానూరు–పాడిపేట మార్గంలోని స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తుండడంతో తిరుపతి–పుత్తూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి–వైఎస్సార్‌ కడప జిల్లా రహదారిలోని బాలపల్లె, కుక్కలదొడ్డి వద్ద కూడా ఇదే పరిస్థితి. కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు రాత్రంతా ఇబ్బందులు పడ్డారు.

Andhra Pradesh Floods 2021 Videos

భారీ వర్షాలకు 540 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 700 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 1,300 గ్రామాల్లో అంథకారం అలుముకుంది. 170 చెరువులకు గండ్లు పడ్డాయి. కలవగుంట వద్ద ఉన్న ఎన్టీఆర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తివేశారు. దిగువన ఉన్న శివాలయం నీట మునిగింది. వరద నీరు ఎక్కువగా చేరడంతో కల్యాణి జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. దీంతో అధికారులు కల్యాణి జలాశయం నుంచి 1200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అటు పాలసముద్రంలో వెంగళరాజకుప్పం చెరువు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దచెరువు కాలువ పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా నేడు విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.

కడప జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతోంది. అన్నమయ్య, ఫించ ప్రాజెక్టుల కట్టలకు గండ్లు పడ్డాయి. చెయ్యేరు నది దిగువకు లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. నదీ పరివాహక ప్రాంతాలు, గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. పశువులు, వాహనాలు కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రాణనష్టం కూడా జరిగినట్లు సమాచారం. భారీ వర్షాల కారణంగా చిత్రావతి నదికి వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఓ కారు నది దాటుతుండగా మధ్యలో చిక్కుకుంది. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే పైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని జేసీబీతో కారులో ఉన్నవారిని కాపాడేందుకు యత్నిస్తున్నారు. చెన్నై కొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామ సమీపంలో నది దాటుతుండగా నీటి ఉధృతికి కారు కొట్టుకుపోయింది. కాగా నీటి ప్రవాహం అధికం కావడంతో జేసీబీ మధ్యలోనే ఆగిపోయింది. చిత్రావతి నది వద్దకు పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అవసరమైతే తక్షణమే సాయం అందించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, స్పెషల్‌ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు గురువారం పిలుపునిచ్చారు. వాగులు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, తిరుపతిలోని పలుప్రాంతాలు నీట మునిగిన క్రమంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సహాయక బృందాలు సాయం అందిస్తున్నాయని చెప్పారు. అత్యవసరమైతే పోలీస్‌ డయల్‌ 100కుగాని, 63099 13960 నెంబరుకు ఫోన్‌చేసి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కుగాని, పోలీస్‌ వాట్సప్‌ నంబర్‌ 80999 99977 కు గాని ఫోన్‌చేసి సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. జిల్లా అంతటా పోలీసు సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, సహాయకచర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించారు. అనంతరం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌నుంచి సీసీ కెమెరాల ద్వారా చూస్తూ ఆయా ప్రాంతాల్లోని పోలీసు సిబ్బంది, అధికారులకు ఆదేశాలిస్తూ పర్యవేక్షించారు.

తిరుపతి నుంచి నెల్లూరు, చెన్నై వెళ్లాల్సినవారు పుత్తూరు, నాగలాపురం, సత్యవేడు, తడ మీదుగా వెళ్లాలి.కడప వైపు వెళ్లాల్సినవారు రేణిగుంట-పూతలపట్టు జాతీయ రహదారిమీదుగా పూతలపట్టు, పీలేరు, రాయచోటి మీదుగా వెళ్లాలని పోలీసులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా అనవసరంగా రోడ్లపైకి వచ్చి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని ఎస్పీ సెంథిల్‌కుమార్‌ సూచించారు. జిల్లావ్యాప్తంగా సహాయ చర్యల్లో పోలీసులు పాల్గొంటున్నారని, వారికి స్థానిక ప్రజలు సహకారం అందించాలని కోరారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున్న... అవసరమైతే తప్ప ప్రజలు వాహనాల్లో లేదా నడిచి బయటికి రాకూడదన్నారు. ప్రజలకు అత్యవసర సేవల కోసం డయల్‌ 100, పోలీస్‌ వాట్సాప్‌ నెంబరు 9440900005 నెంబరుకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.

,