రాయలసీమను తెలంగాణలో కలపాలని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అప్పుడే రాయలసీమకు నీటి కష్టాలు తీరుతాయని చెప్పారు. రాష్ట్రాలను విడగొట్టడం కష్టం కావచ్చని... కానీ, కలపడం మాత్రం సులభమేనని అన్నారు. రాయలసీమను తెలంగాణలో కలపడంపై ఎవరికీ అభ్యంతరాలు కూడా లేవని చెప్పారు.
కొంతమంది ప్రత్యేక రాయలసీమ అంటున్నారని... ఒకవేళ ప్రత్యేక రాయలసీమ ఏర్పడితే సంతోషమేనని అన్నారు. జేసీ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాయలతెలంగాణ అనే ఆప్షన్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటివద్ద దాదాపు 100 మంది పోలీసులు మోహరించారు. ఇంటి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
వివరాల్లోకి వెళ్తే, పెద్దపప్పూరు వద్ద పెన్నా నదిలో ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ కొంత కాలంగా జేసీ ఆరోపిస్తున్నారు. సోమవారం నుంచి ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని, వాటిని తరలించే వాహనాలను తగులబెడతామని ఇటీవలే జేసీ ప్రకటించారు. ఈ క్రమంలో ఈరోజు పెద్దపప్పూరుకు వెళ్లేందుకు జేసీ తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన ఆయనను మళ్లీ బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లేందుకు యత్నించారు.