Amaravathi, August 20: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 4 వరకు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అయితే కర్ఫ్యూ సమయంలో మరో గంట సడలింపు ఇచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సడలింపు సమయాన్ని రాత్రి 10 గంటలకు బదులుగా 11 గంటల వరకు పెంచినట్లు స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించారు.
ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,173 మంది శాంపుల్స్‌ను పరీక్షించగా 1,435 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 20,00,038 చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 19,97,143 గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి 199, నెల్లూరు నుంచి 190, కృష్ణా జిల్లా నుంచి 175, తూర్పు గోదావరి జిల్లా నుంచి 178 మరియు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 154 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 6 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 13,702కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,695 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 19,70,864 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 15,472 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.