Amaravati, Dec 28: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు (Special ST Commission in AP) చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి (DY CM Pushpa Srivani) మాట్లాడుతూ, ప్రత్యేక ఎస్టీ కమిషన్ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. గిరిజనులకు ఇచ్చిన హామీ నెరవేర్చారని, గిరిజన హక్కులు కాపాడేందుకు ఎస్టీ కమిషన్ తీసుకొచ్చారని ఆమె తెలిపారు. సీఎం జగన్‌కు గిరిజనులంతా రుణపడి ఉంటారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.
అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం పూర్తి: తూర్పుగోదావరి జిల్లాలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం పూర్తయింది. ఏడంతస్తుల రథం పూర్తి స్ట్రక్చర్ నిర్మించడంతో పాటు చక్రాలు కూడా ఏర్పాటు చేశారు. మూడు నెలల రికార్డు సమయంలో అధికారులు ప్రధాన నిర్మాణాన్ని పూర్తి చేశారు. మంత్రి వేణు గోపాల కృష్ణ ,జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కూడా రథాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో దేవాదాయశాఖ అధికారులు నేడు రథం ట్రయల్ రన్ నిర్వహించారు.
ప్రధాన ఆలయానికి ఎదురుగా నిర్మితమవుతున్న రథాన్ని తాళ్ళుతో లాగుతూ బయటకు తీసుకు వెళ్లారు. రధం సునాయాసంగా కదలడంతో ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది. పాత రథానికి భిన్నంగా కొత్త రథంలో బ్రేక్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు రధం కింద జాకీలు అమర్చి అవసరమైన చోట సునాయసంగా వెనక్కి తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.