AP CM YS Jagan | File Photo

Amaravathi, July 1: నూతన మార్గదర్శకాలతో కూడిన '‌YSR బీమా' పథకాన్ని ఏపి సీఎం జగన్‌ గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ వర్తించే ఈ పథకం కింద కుటుంబ పోషకులు సహజ మరణం పొందినా, ప్రమాదవశాత్తు చనిపోయినా పరిహారం అందించనున్నారు.

పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకునేందుకు 2021–22కిగాను రాష్ట్రంలో 1.32 కోట్ల పేద కుటుంబాలకు దాదాపు రూ.1,133 కోట్ల వ్యయంతో ఉచిత బీమా రక్షణ కల్పించాలని జగన్ సర్కార్ ఈ YSR బీమా పథకాన్ని ప్రారంభించింది.

బీమా పాలసీకి సంబంధించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం 18 – 50 ఏళ్ల లోపు వారు సహజ మరణం పొందితే ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా లక్ష రూపాయలు చెల్లిస్తుంది. 18 – 70 ఏళ్ల వయసువారు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా రూ. 5 లక్షలు పరిహారం అందించాలని నిర్ణయించారు. బీమాకు సంబంధించి ఇన్సూరెన్స్‌ ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు.

బీమా నమోదు మరియు క్లెయిమ్‌ల చెల్లింపు కోసం ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 155214 ను ఏపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో సెర్ప్‌ విభాగం నోడల్‌ ఏజెన్సీగా ఉండగా తాజాగా గ్రామ/వార్డు సచివాలయ విభాగాన్ని నోడల్‌ ఏజెన్సీగా నిర్ణయించారు. అర్హత వివరాలను సచివాలయాల్లోనూ తెలుసుకోవచ్చునని అధికారులు పేర్కొన్నారు.