
Polavaram, Feb 16: ఏపీ జీవనాడి , బహుళార్ధక సాధక ప్రాజెక్టు పోలవరం (Polavaram Project) పనుల్లో బుధవారం మరో కీలక ఘట్టం పూర్తయింది. 1,655 మీటర్ల పొడవు, 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్ (Lower Coffer Dam ) పనులను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. ఇందుకోసం 34.83 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, కోర్ (నల్లరేగడి మట్టి), రాళ్లను వినియోగించింది.
గోదావరికి ఎంత భారీ వరద వచ్చినా ఈసీఆర్‌ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతంలోకి ఇక వరద దూసుకొచ్చే అవకాశమే ఉండదు.డయాఫ్రమ్ వాల్ సామర్థ్యంపై ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నివేదిక ఇచ్చిన తరువాత డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్), సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మార్గదర్శకాల మేరకు ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయనుంది.
ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్‌ను పూర్తి చేయడం ద్వారా రైతులకు పోలవరం ఫలాలను శరవేగంగా అందించే దిశగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు.