IPS Officers Transferred in AP: ఏపీలో 13 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ, మంగళగిరి డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి, ఏపీ రాజధానిపై గతంలో ఇచ్చిన సమాధానంపై కేంద్ర హోంశాఖ దిద్దుబాటు
AP Government logo (Photo-Wikimedia Commons)

Amaravati, July 14: ఏపీలో 13 మంది ఐపీఎస్‌ అధికారులను (IPS Officers Transferred in AP) బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh government) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, జనరల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా డా.షీముషి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్‌ దేవ్‌ శర్మ, డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని నారాయణ్‌ నాయక్‌కు ఆదేశాలు అందాయి.

ఆక్టోపస్‌ ఎస్పీగా డా. కోయ ప్రవీణ్‌, ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్‌ కమాండెంట్‌గా విక్రాంత్ పాటిల్‌, మంగళగిరి డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీగా మాలికా గార్గ్‌, విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్‌దేవ్‌ సింగ్‌, కాకినాడ మూడో బెటాలియన్‌ కమాండెంట్‌గా గరుడ్‌ సుమిత్‌ సునీల్‌, విశాఖ డీసీపీ-1గా గౌతమీ శాలి, ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా వకుల్‌ జిందాల్‌, మంగళగిరి ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా అజితా వేజెండ్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కేసీఆర్ సర్కార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది, జీవో నెంబర్ 34 ను రద్దు చేయండి, తెలంగాణ వైఖరిపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌, కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని విజ్ఞప్తి

ఇక ఏపీ రాజధాని (AP Capital) అంశంపై సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధానాన్ని కేంద్ర హోంశాఖ (Home ministry) తాజాగా సరిదిద్దుకుంది. ప్రస్తుత దిద్దుబాటు ప్రకారం మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందని తెలిపింది. గతంలో మూడు రాజధానుల అంశంపై (Three Capitals) చైతన్యకుమార్‌రెడ్డి అనే వ్యక్తి గతంలో కేంద్ర హోంశాఖకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తుకు కేంద్ర హోంశాఖ సీపీఐవో రేణు సరిన్‌ జూలై నెల 6న సమాధానమిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టం-2020 ప్రకారం రాష్ట్రంలో మూడు పరిపాలన కేంద్రాలుంటాయి. వాటిని రాజధానులు అంటారు. రాష్ట్ర రాజధాని అంశాన్ని ఆ రాష్ట్రమే నిర్ణయించుకుంటుందని అందులో పేర్కొన్నారు. ఈ సమాధానంపై అమరావతి జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ జి.వి.ఆర్‌.శాస్త్రి అభ్యంతరం చెబుతూ కేంద్ర హోంశాఖ అప్పిలేట్‌ అథారిటీ అయిన సంయుక్త కార్యదర్శి ప్రకాష్‌కు ఈనెల 9న లేఖ రాశారు.

క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్రం తరఫున సీపీఐవో తప్పుడు సమాచారమిచ్చారని లేఖలో పేర్కొన్నారు. ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదని, రాజధాని అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని తెలిపారు. ఈ లేఖపై స్పందించిన కేంద్ర హోంశాఖ సీపీఐవో రేణు సరిన్‌ రాజధాని అంశం న్యాయ పరిధిలో ఉందంటూ తాను గతంలో ఇచ్చిన సమాధానానికి భిన్నంగా బదులిచ్చారు.