Amaravathi, September 16: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 39 అంశాలపై కేబినెట్ చర్చించింది. వైయస్సార్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గృహ నిర్మాణానికి రూ.35వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు 20 ఏళ్లు పెట్టే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. మైనార్టీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్‌లో రుణాలు తీసుకున్న వారికి వన్ టైం సెటిల్‌మెంట్ పథకాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు పొందిన వారిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు రూ.10వేలు, మున్సిపాల్టీకి చెందిన వారు రూ.15వేలు, అర్బన్ ప్రాంతాలకు చెందిన వారు రూ.20వేలు చెల్లింపును వన్ టైం సెటిల్‌మెంట్ కింద కల్పించారు. అలాగే హౌసింగ్ కార్పొరేషన్‌నుంచి రుణం తీసుకుని, ఒకవేళ ఆ ఇల్లు ఎవరికైనా అమ్మిన పక్షంలోప్రస్తుతం ఆ ఇంటిని కొనుగోలుచేసిన, అర్హత ఉన్నవారు గ్రామీణ ప్రాంతాలలో రూ. 20వేలు, మున్సిపాల్టీల్లో రూ.30వేలు, కార్పొరేషన్‌లలో రూ.40వేలు వన్ టైం సెటిల్ మెంట్ కింద కడితే సరిపోతుంది. అలాగే హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకోకుండా ఇల్లుకట్టుకుంటే.. వారికి ప్రభుత్వం ఉచితంగా హక్కులు కల్పిస్తుంది. వన్ టైం సెటిల్‌మెంట్ ద్వారా దాదాపు 46 లక్షలమందికిపైగా లబ్ధి పొందనున్నట్లు అంచనా.
ఏపి కేబినేట్ నిర్ణయాలు ఇలా ఉన్నాయి:
- పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులైన ఆడపడుచులకు పావలా వడ్డీ కింద రూ.35వేల చొప్పున రుణాలు. తొలి దశలో 15,60,227 ఇళ్ల నిర్మాణం. ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం రూపేణా ఆడపడుచుల చేతిలో దాదాపు రూ.4–5 లక్షల ఆస్తి. దీనిపై 3 శాతం స్వల్ప వడ్డీకి రుణాలు. మిగతా వడ్డీని భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం, ఈ పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం.
- నవరత్నాల అమలులో మరో కార్యక్రమం, రెండో విడత ఆసరాకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ . 2021–22 గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాలకు ఆసరా వర్తింపు. నేరుగా మహిళల చేతిలో పెట్టనున్న ప్రభుత్వం. ఏప్రిల్ 11, 2019 నాటికి బ్యాంకుల్లో ఉన్న డ్వాక్రా రుణాల మొత్తాన్ని నాలుగు విడతల్లో అందిస్తామంటూ హామీ. ఇందుకోసం రూ. 27,168.83 కోట్లను 4 దఫాలుగా పంపిణీ.
- ఈ డబ్బును మహిళల సుస్థిర ఆర్థిక ప్రగతికి వినియోగించేలా పలు బహుళజాతి, పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ఉపాధి మార్గాలు చూపుతున్న ప్రభుత్వం. ఆసరా, చేయూతలపై మహిళల్లో అవగాహన, చైతన్యానికి, సాధికారిత దిశగా అడుగుల వేయించే మార్గంలో చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేసేందుకు 10 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్న ప్రభుత్వం
- ఆస్పత్రులు, స్కూళ్లలో చేపడుతున్న నాడు – నేడు కార్యక్రమాలకు సహాయం అందించిన దాతల పేర్లు పెట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. దీనికి సంబంధించిన విధివిధానాలకు కేబినెట్ అంగీకారం. రూ. 50 లక్షలు ఇస్తే శాటిలైట్ ఫౌండేషన్ స్కూలుకు పేరు, రూ.1 కోటి దానం చేస్తే ఫౌండేషన్ స్కూలుకు, రూ.3 కోట్లు ఇస్తే హైస్కూల్‌కు దాతల పేర్లు పెట్టడంతో పాటు, రూ.1 కోటిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, రూ. 5 కోట్లు ఇస్తే సీహెచ్‌సీకి, రూ.10 కోట్లు ఇస్తే ప్రాంతీయ ఆస్పత్రికి దాతల పేర్లు పెట్టాలని నిర్ణయం.
- డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ 1940 చట్టం సవరణకు కేబినెట్ ఓకే, కల్తీలు, నకిలీలను అడ్డుకునేందుకు చట్ట సవరణ, తప్పిదాలకు పాల్పడితే లైసెన్స్‌ల రద్దు, భారీ జరిమానాలు.
- విశాఖ జిల్లా అరుకు మండలం మజ్జివలస గ్రామంలో ఏకలవ్య మోడల్‌స్కూల్ నిర్మాణం కోసం 15ఎకరాల ప్రభుత్వ భూమిని గిరిజన సంక్షేమ శాఖకు బదలాయించేందుకు కేబినెట్ అంగీకారం.
- చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం, యాదమర్రి గ్రామంలో 2.56 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐఓసీఎల్, టెర్మినల్ నిర్మాణంకోసం ఎకరా రూ.30 లక్షల చొప్పున కేటాయించేందుకు కేబినెట్ నిర్ణయం.
- వైయస్సార్ జిల్లా, రాయచోటి మండలం మాసాపేట గ్రామంలో యోగివేమన యూనివర్శిటీ పీజీ సెంటర్ ఏర్పాటుకోసం 53.45 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం.
- గుంటూరు వెస్ట్ మండలం అడవి తక్కెళ్లపాడులో షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కోసం 2 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం, ఎకరా రూ.1.2కోట్లకు ఇచ్చేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్.
- గుంటూరుజిల్లా చిలకలూరి పేట మండలం ఎడవల్లిలో 223 ఎకరాల భూమి ఏపీఎండీసీకి కేటాయింపు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మున్సిపాల్టీ పరిధిలో 31 సెంట్లను కమ్యూనిటీ హాలు, విద్యాసంస్థ నిర్మాణానికి మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు కేటాయిస్తూ నిర్మాణం.
- శ్రీశైలంలో శ్రీశైల జగద్గురు పండితారాధ్య సేవాసమితి ట్రస్ట్‌కు 10 ఎకరాల భూమి 33 ఏళ్ల లీజుకు గజం రూ.10ల చొప్పున కేటాయింపు. ప్రతి మూడేళ్లకు 30శాతం పెరగనున్న లీజు.
- ఏపీ ఫాస్టర్ కేర్ గైడ్‌లైన్స్ 2021కి కేబినెట్ ఆమోదం.
- జువనైల్ జస్టిస్ చట్టం 2015 కింద మార్గదర్శకాలు. తల్లిదండ్రులు శారీరక, మానసిక అనారోగ్యంతో ఉండి, పిల్లల సంరక్షణ చేపట్టలేని స్ధితిలో ఉన్న వారి పిల్లలను సంరక్షకులకు అప్పగించే విషయంలో మార్గదర్శకాలు. సంరక్షకుల సమర్థత, ఉద్దేశం, సామర్థ్యం, పిల్లల సంరక్షణ లో వారి అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలంటున్న మార్గదర్శకాలు
- నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మైక్రోసాఫ్ట్ కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం, దాదాపు రూ.30.79 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 కాలేజీలు, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల్లో 40 సర్టిఫికేషన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్న మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రాజెక్ట్ అమలుకు మానిటరింగ్, ఎవల్యూషన్ కమిటీని కూడా ఏర్పాటుచేయనున్న ప్రభుత్వం
- రాయలసీమ కరవు నివారణ లో భాగంగా హంద్రీనీవా సుజలస్రవంతి ఫేజ్–2లో భాగంగా పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌ను 79.6 కి.మీ. నుంచి 220.35 కి.మీ వరకూ రూ.1929 కోట్లతో విస్తరించనున్న పనులకు ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలనుంచి మినహాయింపునకు కేబినెట్ ఓకే, అత్యంత కరవు పీడిత ప్రాంతాలైన తంబళ్లపల్లి, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో తాగునీటి కల్పనే లక్ష్యం.
- మైనార్టీ వర్గాలకూ సబ్ ప్లాన్, చారిత్రక నిర్ణయమని ప్రశంసించిన కేబినెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు మైనార్టీలకు సబ్‌ప్లాన్. సూత్ర ప్రాయ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
- వైయస్సార్ జిల్లా కాశినాయన మండలంలో లా అండ్ ఆర్డర్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం, ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 21 మంది కానిస్టేబుళ్లు, 5 అవుట్‌సోర్సింగ్ పోస్టులు, 2 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు డ్రైవర్లు, ఒక స్వీపర్ పోస్టు మంజూరు. సీఐడీ డిపార్ట్‌మెంట్‌లో అడిషనల్ హోంగార్డు పోస్టులు మంజూరుకు కేబినెట్ ఆమోదం
- శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ మంజూరుకు కేబినెట్ ఆమోదం, ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ఏడాది కాలానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.1.5 కోట్లు. రాష్ట్రంలో సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కృషిచేయనున్న ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ. తొలిసారిగా రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న ఆర్గానిక్ సర్టిఫికేషన్ అధారిటీ సేవలు. గతంలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం దూరాభారంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్ధితి. తాజా నిర్ణయంతో రాష్ట్రంలోనే ఆర్గానిక్ సర్టిఫికేషన్.