Amaravati, Mar 30; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచింది. 30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు యూనిట్‌కు 91 పైసలు (Electricity Charges Hikes in AP) పెంచారు. 76 నుంచి 125 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 1.40 పైసలు పెంచుతూ ప్రభుత్వం (Andhra Pradesh govt) నిర్ణయం తీసుకుంది. 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ. 6 లు, 226 నుంచి 400 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 8.75 పైసలు , 400 యూనిట్లకు పైగా ఉన్నవాటికి యూనిట్‌కు రూ. 9.75 పైసలు ప్రభుత్వం ఛార్జీలను పెంచింది.
తిరుపతి సెనేట్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ రెగ్యులేటరీ చైర్‌మన్ జస్టిస్ నాగార్జున వివరాలను వెల్లడించారు. పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలను పెంచడం జరిగిందన్నారు. గృహ వినియోగదారులు సహకరించాలని కోరారు. ఛార్జీల పెంపుదల వల్ల ప్రభుత్వానికి 14 వందల కోట్లు ఆదాయం వస్తుందని ఆయన వెల్లడించారు. కాగా ఏపీలో ఇప్పటికే ఏడుసార్లు విద్యుత్ చార్జీలను పెంచారు.
ఇక రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల బాదుడు పట్ల ప్రభుత్వంపై పోరాటం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ శ్రేణులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఐ నాయకులు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. రేపటి నుంచి వరుస నిరసనలకు పిలుపునిచ్చినట్లు సీపీఐ ఏపీ నాయకుడు రామకృష్ణ వెల్లడించారు. ఇంటి పన్ను, చెత్తపన్ను పెంచి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచి నడ్డి విరుస్తుందని ఆరోపించారు.