ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులపై ఏపీ పాఠశాల విద్యాశాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు.సాధారణంగా ఏటా మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు (Half-Day Schools in AP) పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి రాష్ట్రంలో ఆ విధానం అమలు చేస్తారో లేదో చూడాలి. ఒక్క పూట బడులు సమయంలో ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించే అవకాశం ఉంది.
మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు, ఏప్రిల్ 25 నుండి పాఠశాలలకు వేసవి సెలవులు
ఆంధ్రప్రదేశ్ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకెడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏపీలో 1వ తరగతి నుంచి 9 తరగతుల విద్యార్థులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగియనున్నాయి. అనంతరం మరో రెండు రోజుల పాటు ఫలితాల వెల్లడి, పేరెంట్స్ మీటింగ్స్ ఉంటాయి. తర్వాత ఏప్రిల్ 30 నుంచి స్కూల్స్‌కు సెలవులు ఉంటాయని ఏపీ విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ జూన్ 12 నుంచి స్కూల్స్ పున:ప్రారంభం అవ్వనున్నట్లు సమాచారం. దాదాపు 45 రోజులు పాటు ఏపీ పాఠశాలకు సెలవులు రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 19వ తేదీన నుంచి వారికి సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ఆరు సబ్జెక్టులకు మాత్రమే నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
పరీక్షల టైమ్ టేబుల్ ఫైనల్ చేసిన నేపథ్యంలో.. పబ్లిక్ హాలీడేలు, సాధారణ సెలవులు ప్రకటించినా ఆ రోజుల్లో పరీక్షలు యథాతథంగా జరుగనున్నాయి. స్టూడెంట్స్‌కు కేటాయించిన కేంద్రాల్లో మాత్రమే పరీక్షలను రాయాల్సి ఉంటుందని, ఎగ్జామ్ సెంటర్స్ మార్పును ఎట్టి పరిస్థితుల్లో అమోదించరని ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు గతంలో స్పష్టం చేసిన విషయం తెల్సిందే.