Vijayawada, Sep 16: విజయవాడ దుర్గమ్మ గుడిలోని వెండి రథం, నాలుగు వైపులా ఉండే వెండి సింహం ప్రతిమలు మాయమైనట్టు (Durga Temple Silver Lion Idols Missing) ఆలయ అధికారులు గుర్తించారు. రథానికి నాలుగు వైపులా ఉండాల్సిన సింహం ప్రతిమల్లో మూడు కనిపించడం లేదని (Durga Temple Silver Lion Idols) ఆలయ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivasa Rao) అమ్మవారి వెండి రథాన్ని బుధవారం పరిశీలించారు. అమ్మవారి వెండిరథంపై మూడు సింహాలు కనిపించడం లేదని పరిశీలనలో తేలిందని వెల్లడించారు. ఆలయాల్లో రథాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
చాలా ఆలయాల్లో భద్రతను ప్రైవేట్ ఏజెన్సీలు చూస్తున్నాయని గుర్తు చేశారు.రథానికి భద్రత కల్పించే చర్యల్లో భాగంగా అధికారులు దానిపై టార్పాలిన్ తో కప్పి ఉంచారని, టార్పాలిన్ తొలగించిన సమయంలో మూడు సింహాలు మాయమైనట్టు గుర్తించారని, వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రథాన్ని ఒక్కసారి కూడా ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. ఘటనపై దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని మంత్రి చెప్పారు. అన్ని విషయాలు విచారణలో తేలుతాయని అన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు (Somu Veerraju) వెండిరథం ఉంచిన ప్రాంతాన్ని పరిశీలించారు. మూడు సింహాల ఘటనపై ఆలయ ఈవో సురేశ్ ను ప్రశ్నించారు. మూడు సింహాలు లాకర్ లో ఉండొచ్చని ఈవో సమాధానం ఇవ్వడంతో సోము వీర్రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రథానికి ఉండాల్సిన సింహాలు లాకర్ లో ఉండడం ఏంటని నిలదీశారు. మూడు సింహాల మాయం ఘటనలో ఈవో సమాధానం వింటుంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అన్నారు. ఇదే అంశాన్ని సోము వీర్రాజు ట్విట్టర్ లోనూ ప్రస్తావించారు.
దుర్గగుడిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రథం నిర్మాణంలో నాలుగు సింహాలను అమర్చారని, వాటిలో ఒకటి మాత్రమే మిగిలుందని, మరో మూడు సింహాలు కనిపించడంలేదని తెలిపారు. మిగిలిన ఒకటి కూడా అసంపూర్ణంగా ఉందని, ఈ ఘటనలో ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టమవుతోందని, అదే సమయంలో పవిత్రతను కాపాడే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందని ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ జరిపి రెండ్రోజుల్లో వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
Here's AP BJP Chief Somu Veerraju Tweet
పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఆలయ అధికారి ఆధీనంలో ఉండే రక్షణ వ్యవస్థ సరియైన పద్దతి అవలంబించని వైఖరిని కండిస్తున్నాము, ప్రభుత్వం సంబంధిత విచారణ చేసి 2 రోజుల్లోనే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. (2/2) pic.twitter.com/aQvdiyIfKy
— Somu Veerraju (@somuveerraju) September 16, 2020
ఇదిలా ఉంటే ఏపీలో విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నగరంలోని నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయం వెలుపల ఉంచిన విగ్రహం నుంచి తల, కాలు వేరు చేసినట్టు నిర్వాహకులు గుర్తించారు. నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పటమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సీఐ సురేశ్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమైన వ్యక్తులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.