Ippatam,Dec 15: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం కేసులో (Ippatam Demolition Case) పిటిషనర్లకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు వ్యవహారంలో కోర్టును (AP high court) మోసం చేయటంపై 14 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి గతంలో లక్ష రూపాయలు జరిమానా విధించింది సింగిల్ బెంచ్. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టులో రిట్ ఆప్పీల్ దాఖలు చేశారు. పిటిషన్లు దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను ( high court dismisses writ petition) ధర్మాసనం బుధవారం కొట్టేసింది.
ఇలాంటి వ్యవహారాలను సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్లు అంతా రైతులేనని, వాళ్లు తెలియక తప్పు చేశారని ధర్మాసానికి తెలియజేశారు పిటిషన్ తరపున న్యాయవాది. దీంతో వాళ్లకు తెలియకపోతే మీరు చదువుకున్న వారేగా.. మీకు తెలియదా అని పిటిషన్ల తరఫున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేయటం మంచిది కాదని తెలిపింది.
రహదారి విస్తరణ పేరుతో అధికారులు తమ ఇళ్లు, ప్రహరీ గోడలను కూల్చి వేస్తున్నారని, దానిని నిలువరించాలని కోరుతూ ఇప్పటం గ్రామానికి చెందిన బెల్లంకొండ వెంకటనారాయణతో పాటు మరో 13 మంది నవంబర్ 4న హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం వేశారు. వారి వాదనలు విన్న న్యాయమూర్తి.. తొందరపాటు చర్యలొద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా ప్రభుత్వ న్యాయవాది పిటిషనర్లందరికీ షోకాజ్ నోటీసు ఇచ్చామని.. వారు ఆ విషయాన్ని అఫిడవిట్‌లో పేర్కొనలేదని వెల్లడించారు. ఆ తర్వాత మరోసారి విచారణకు రాగా.. షోకాజ్ నోటీసులు అందుకున్నారో లేదో చెప్పాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది టి.సాయిసూర్యను న్యాయమూర్తి ప్రశ్నించారు. అవునని ఆయన బదులిచ్చారు. ఆ విషయాన్ని అఫిడవిట్‌లో ఎందుకు ప్రస్తావించలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు.
ఉదయాన్నే కూల్చివేతలు చేపట్టడం, హడావుడిగా లంచ్ మోషన్ రూపంలో కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం, పిటిషనర్లు నిరక్షరాస్యులు కావడం తదితర కారణాలతో నోటీసుల విషయాన్ని అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని పేర్కొన్నారు. జరిగిన పొరపాటుకు క్షమాపణలు కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా కూల్చి వేస్తున్నారని అనడంవల్లే అప్పుడు మధ్యంతర ఉత్తర్వులిచ్చామని గుర్తు చేశారు.
వివరణ ఇచ్చేందుకు పిటిషనర్లు నవంబర్ 24న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆరోజు గ్రామస్థులు హాజరుకాగా.. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ వారు రిట్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు తాజాగా దాన్ని డిస్మిస్ చేసింది.