VJy, Nov 9: ఏపీ హైకోర్టులో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి సంబంధించిన పిటిషన్ పై విచారణ జరిగింది. తన పైన సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు (High Court ) బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ స్థలం ఆక్రమణ కేసును కొట్టేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. 41ఏ నోటీసు ( Section 41A of CRPC) ఇవ్వాలని సంబంధిత విచారణ సంస్థకు సూచించింది. అంతేకాదు.. అయ్యన్నపాత్రుడిని, ఆయన తనయుడు రాజేష్‌ను సీఐడీ విచారించుకోవచ్చని తెలుపుతూ.. విచారణకు అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) సహకరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
పది సంవత్సరాల పైన శిక్ష పడే సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని కీలక తీర్పును హైకోర్టు వెలువరించింది. ప్రాథమిక అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామని కోర్టు చెప్పింది. జలవనరుల శాఖ అధికారులు ఇచ్చిన ఎన్‌ఓసీ.. విలువైన పత్రాల నిర్వచనం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శక సూత్రాల ప్రకారం నడుచుకోవాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.
అయ్యన్నపాత్రుడిపై సిఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన తరుపు న్యాయవాది వీవీ సతీష్ హైకోర్టును ఆశ్రయించారు. గత వారం ప్రభుత్వం, అయ్యన్నపాత్రుడు తరపు న్యాయవాదుల వాదనలను విన్న అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ రోజు అయ్యన్నపాత్రుడి కేసులో ఐపీసీలోని సెక్షన్ 467 వర్తించదని కోర్టు స్పష్టం చేసింది.