Machilipatnam, April 13: కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటనలో చంద్రబాబుకు చేదు అపుభవం ఎదురైంది. మాజీ సీఎం పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సెగ తగిలింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు ప్రదర్శించిన అభిమానులు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ చంద్రబాబు కాన్వాయ్ ఎదుట నినాదాలు చేశారు.
రోడ్డు వెంబడి జూ.ఎన్టీఆర్, హరికృష్ణ ఫొటోలు చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నినాదాలు చేసిన వాళ్లను పట్టుకోవాలంటూ టీడీపీ నేతలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫొటో పట్టుకున్న యువకుడిపై చంద్రబాబు మనుషులు దాడి చేశారు. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు కనబడకూడదని చంద్రబాబు హుకుం జారీ చేశారు. మచిలీపట్నంలోని మూడు బొమ్మల సెంటర్ వద్ద మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో జూ.ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులు చేస్తున్నవారిని కొల్లు రవీంద్ర, అనుచరులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులకు తొపులాటలు జరిగాయి.