Amaravati, June 9: పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్(Lokesh) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో టీడీపీ నేత నారా లోకేష్‌కు మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఝలక్ ఇచ్చారు. విద్యార్థులతో నారా లోకేష్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో (Lokesh Zoom Meeting) విద్యార్థులతో పాటు కొడాలి నాని, వల్లభనేని వంశీ పాల్గొన్నారు. వీరిద్దరిని చూడగానే లోకేష్ వెంటనే జూమ్ లైవ్‌ను కట్ చేశారు.
దీనిపై నాని మాట్లాడుతూ.. టీడీపీ నేత నారా లోకేశ్ పిల్లలతో రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. అభం శుభం తెలియని చిన్న పిల్లలను ఆత్మహత్యలకు ప్రేరేపించేందకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ధైర్యం చెప్పకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఫేక్ ఐడీలతో లాగిన్ అవ్వలేదని స్పష్టం చేశారు. తన మేనల్లుడి ఐడీతో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. విద్యార్థి మేనమామతో లోకేశ్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
పిల్లలు కొడతారనే భయంతోనే లోకేశ్ జూమ్‌లో మాట్లాడారని కొడాలి నాని (Kodali Nani) ఎద్దేవా చేశారు. తాను కనపడగానే జూమ్ మీటింగ్ కట్ చేసి పారిపోయారని అన్నారు. విద్యార్థులను పిలిచి మరోసారి చర్చ పెట్టమనండని, తాము వెళ్తామని అన్నారు. తన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెబితే బాగుండేదన్నారు. కరోనా సమయంలో పాఠశాలలు మూసివేశాలని గొడవ చేసింది ఎవరని కొడాలి నాని ప్రశ్నించారు. విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలు తెరిస్తే.. కరోనా సమయంలో పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతారా అని స్కూల్స్‌ను మూసివేయాలని ఆందోళనలు చేసింది టీడీపీ వాళ్లే కదా అని గుర్తు చేశారు.
తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ తమ పార్టీ నాయకులతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో మాజీ మంత్రి కొడాలి నాని ప్రత్యక్షమై మాట్లాడారు. దీనిపై టీడీపీ మాజీమంత్రి జవహర్ స్పందించారు. కొడాలి నాని పాల్గొనాల్సింది జూమ్ మీటింగ్‌లో కాదు, పది పరీక్షల్లో అని అన్నారు. వేలి ముద్రగాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇలాగే ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. జగన్‌తో పాటు ఆయన సహచరులకు చదువుంటే చులకన భావం ఉందన్నారు. లోకేష్ విద్యార్థుల కోసం యజ్ఞం చేస్తే.. మీరు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని విమర్శించారు. అసలు రాష్ట్రంలో చదువులు ఎటు పోతున్నాయో అర్దం కాని పరిస్థితి నెలకొందన్నారు.
జూమ్ పాలిటిక్స్ (Zoom Politics)పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achennaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి పరీక్షా ఫలితాలపై మంత్రి బొత్స జూమ్ కాన్ఫరెన్స్ పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం, వైసీపీ నేతల జీవితాలే ఫేక్ అని ఆరోపించారు. లోకేష్ నిర్వహిస్తున్న జూమ్ కార్యక్రమంలోకి వైసీపీ వాళ్లు దొంగల్లా జొరబడ్డారని విమర్శించారు. పిల్లల్ని భయపెట్టి జూమ్ కాన్ఫరెన్సులోకి వైసీపీ నేతలు వచ్చారని మండిపడ్డారు.
మా జూమ్ కాన్ఫరెన్సులోకి రావడం కాదు.. విద్యార్థులతో మంత్రి బొత్స జూమ్ కాన్ఫరెన్స్ పెట్టగలరా?.. మంత్రి బొత్స కాన్ఫరెన్స్ పెడితే.. విద్యార్థులు, తల్లిదండ్రులు జూమ్‌లోనే చీపుర్లతో కొడతారు.. ముఖాన ఉమ్మేస్తారు.. పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని దద్దమ్మలు.. పనికి మాలిన వెధవలు జొరబడ్డారు.. వైసీపీది ఫేక్ పార్టీ అని నిరూపితం అయింది. జూమ్ కాన్ఫరెన్సులోకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. పదో తరగతి పాస్ కాని వెధవలు జూమ్ కాన్ఫరన్సులోకి వచ్చారు.. 2 లక్షల మంది విద్యార్థులు తప్పలేదా..?, కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చోసుకోలేదా..?, విద్యార్థులకు మనో ధైర్యం కల్పించాలని మేం కాన్ఫరెన్స్ పెడితే దొంగల్లా వచ్చారు.. విద్యార్ధులు తప్పలేదని.. ఆత్మహత్యలు చేసుకోలేదంటే మేం క్షమాపణ చెబుతాం’’ అని అచ్చెన్నాయుడు అన్నారు.