Kakinada, January 04: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra pradesh GOVT) ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ చట్టం (Disha Act) ఏపీలో (AP)త్వరలో అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం దిశ పోలీస్‌స్టేషన్‌ను(Disha Police Station) ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దిశ చట్టం అమలులో భాగంగా కాకినాడ నగరంలో(Kakinada) దిశ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు.
టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిశ చట్టం పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా నగరంలో ప్రత్యేక దిశ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దీనికి అవసరమైన విధంగా నగరంలోని కొన్ని పోలీస్‌స్టేషన్లతో పాటు, మరికొన్ని ఖాళీ స్థలాలను పరిశీలించామన్నారు.
దిశ పోలీస్‌స్టేషన్‌లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఆయన తెలిపారు. దిశ చట్టాన్ని అమలు చేసేందుకు జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కలెక్టరేట్ ప్రాంతం ఉన్న స్థలాన్ని, డీఎస్పీ కార్యాలయం, త్రీటౌన్, టూటౌన్, మహిళా పోలీస్‌స్టేషన్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్–2ను ఎస్పీ అద్నాన్ నయీం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్సైలతో ఆయన సమీక్షించారు. ఎస్పీతో పాటు ఈ తనిఖీల్లో డీఎస్పీలు కరణం కుమార్, సుంకర మురళీమోహనరావు తదితరులు ఉన్నారు.
దిశ చట్టాన్ని అమలు చేయడానికి జిల్లాకు ఒక దిశ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చెయ్యనున్నట్టు దిశ చట్టం పరిరక్షణ ప్రత్యేకాధికారి కృతికా శుక్లా తెలిపారు. సత్వర న్యాయం కోసం,చట్టం అమలు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.
రోజురోజుకీ పెరిగిపోతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేసే పనిలో ఏపీ సర్కార్ పని చేస్తుందని ఆమె పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లోనే కఠిన శిక్ష పడేలా ఈ చట్టాన్ని రూపొందించిన నేపధ్యంలో చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.చట్టం అమలుకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనతోపాటు సిబ్బంది నియామకాలకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారని ఆమె వెల్లడించారు.
ఈనెల 7 నుంచి ‘దిశ యాప్'ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, కాల్ సెంటర్ కూడా ప్రారంభిస్తామని శుక్లా వెల్లడించారు . మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఈ చట్టం నిర్భయ చట్టం కంటే ఎంతో పటిష్టమైనదని అన్నారు. దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించాల్సి ఉందని చెప్పిన కృతికా శుక్లా చిన్నారులకు పాఠశాల స్థాయి నుండే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తామని వెల్లడించారు ,