Andhra Pradesh Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‌రాజు, రమేష్ యాదవ్‌, గవర్నర్ కోటా కింద నామినేట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్సీల చేత ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం
Four MLCs Takes Oath In AP Legislative Council (Photo-File Image)

Amaravati, June 21: గవర్నర్‌ కోటా కింద నలుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‌రాజు, రమేష్ యాదవ్‌లు ఎమ్మెల్సీలుగా సోమవారం అసెంబ్లీలో (Assembly) ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్సీల చేత ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు శ్రీ రంగనాథరాజు, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు పాల్గొన్నారు.

గవర్నర్‌ కోటా (Governor quota) కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. అయితే కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు.

ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం, సీఎం జగన్‌ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

ఇదిలా ఉంటే శాసనమండలిని రద్దు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. మెజారిటీ ఉన్నప్పుడు మండలిని రద్దుచేస్తే చిత్త శుద్దిని ప్రజలు నమ్ముతారని అన్నారు. మెజారిటీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తిందన్నారు. మండలిలో మెజారిటీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో సీఎం జగన్ గౌరవం పెరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. మండలి కొనసాగించడం వృధా అవుతుందని ముఖ్యమంత్రి చెప్పిన మాటలను నమ్మాలంటే తక్షణమే శాసనమండలిని రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు ఆ లేఖలో పేర్కొన్నారు. క్రమశిక్షణగల పార్టీ కార్యకర్తగా మండలి రద్దుకు పార్లమెంట్‌లో ప్రయత్నిస్తానని రఘురామ అన్నారు.