Nellore, July 13: ఏపీలోని నెల్లూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న రూ.3.14 కోట్ల విలువైన మద్యాన్ని ( Liquor bottles) పోలీసులు ధ్వంసం చేశారు. 74,547 మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్లతో (Liquor Bottles Destroyed) తొక్కించారు. గత మూడేండ్లుగా దాడులు నిర్వహించిన స్వాధీనం చేసుకున్న ఈ బాటిళ్లను పోలీస్ అధికారులు పగులగొట్టించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ఎస్‌ఈబీ స్టేషన్ల పరిధిలో గత మూడేండ్ల నుంచి అక్రమ మద్యం రవాణాపై 2,774 కేసులు నమోదయ్యాయని ఎస్పీ సీహెచ్ విజయారావు తెలిపారు.
ఎస్పీ విజయారావు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు అధికారులు గట్టిచర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఎస్‌ఈబీ ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 74,547 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. అక్రమ రవాణాదారులపై 2,774 కేసులు నమోదు చేశారు. పొదలకూరు రోడ్డులోని టాస్క్‌ఫోర్స్ ఆఫీస్ గ్రౌండ్‌లో భారీగా మద్యం నిల్వలను అధికారులు రోడ్డు రోలర్‌తో తొక్కించారు. స్థానిక పోలీసులతో పాటు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో స్లీత్‌లు దాడులు నిర్వహించి, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి అక్రమంగా రవాణా చేస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఇతర మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జిల్లా నుంచి అంతర్రాష్ట్ర సరిహద్దుల ద్వారా రాష్ట్రంలోకి ఎన్‌డిపిఎల్‌ను అక్రమంగా రవాణా చేయడంపై గట్టి నిఘాను అమలు చేస్తున్నారు. మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా, వాహనాల తనిఖీలును మెరుగుపరిచినట్లు ఎస్పీ విజయారావు చెప్పారు. జిల్లాలో ‘పరివర్తన్’లో భాగంగా స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
పదేపదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఈబీ జాయింట్ డైరెక్టర్ పీ శ్రీలక్ష్మి, నెల్లూరు ఇంఛార్జి ఏసీ రవికుమార్, ఏఈఎస్ కృష్ణకిషోర్‌రెడ్డి, ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో ఈ మద్యం ధ్వంసం కార్యక్రమం చేపట్టారు.