AP Local Body Elections: సంక్షేమ పథకాలు ఆపేయండి, కొత్త సర్క్యులర్‌ జారీ చేసిన ఎన్నికల సంఘం, ఎస్ఈసీ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన జగన్ సర్కారు, హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు, సోమవారం విచారణకు..
Nimmagadda Ramesh kumar vs AP CM YS Jagan (Photo-File Image)

Amaravati, Jan 9: ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పంచాయితీ ఎన్నికల నిర్వహణ ఉత్తర్వుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (YS Jagan Government) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. శనివారం హైకోర్టులో (AP High Court) హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా..అది సోమవారం విచారణకు రానుంది.

ఇవాళ సమయం ముగిసిపోవడంతో సోమవారం విచారిస్తామని కోర్టు పేర్కొంది. ఇది ఇలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను (AP Local Body Elections) తిరిగి ప్రారంభించాలన్న సుప్రీంకోర్టు తీర్పును తోసిరాజని గ్రామ పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు శుక్రవారం రాత్రి షెడ్యూల్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

కరోనా వ్యాక్సినేషన్, ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం అంటోంది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ (SEC nimmagadda ramesh kumar)‘పంచాయతీ పోరు’కు ముహూర్తం పెట్టేశారు. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో నాలుగు విడతలుగా గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే కౌంటింగ్‌, ఫలితాల ప్రకటన... ఉప సర్పంచి ఎన్నిక జరుగుతుందని తెలిపారు. శుక్రవారం రాత్రి దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు.

ప్రజల ప్రాణాలే ముఖ్యం, ఎన్నికలు నిర్వహించలేం.. కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియలో అధికారులు బిజీ, ఎస్ఈసీ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయనున్న ఏపీ ప్రభుత్వం, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

ఈ వివాదం ఇలా నడుస్తుంటే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ (nimmagadda ramesh kumar) మళ్లీ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్‌ను అమల్లో ఉన్నందును ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం సర్క్యులర్‌ జారీ చేసింది. దీంతో లక్షలాది మంది తల్లులు ఎదురుచూస్తున్న అమ్మఒడి పథకానికి ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది.

ఇదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లపట్టాల పంపిణీపైనా ఆంక్షలు విధించినట్లయింది. సంక్షేమ పథకాలపై గవర్నర్‌ ప్రసంగంలో పేర్కొన్నా, బడ్జెట్‌ కేటాయింపులు చేసినా పథకాల అమలు ఓటర్లను ప్రభావితం చేస్తుందంటూ ఎస్‌ఈసీ వాటిని ప్రజలకు అందించడం ఆపేయాలంటూ సర్క్యులర్‌ జారీ చేసింది.

ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు మద్దతుతోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్‌పై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. రిటైర్డ్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కు ప్రభుత్వం మొత్తం సలాం చెయ్యాలా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ డిపాజిట్లు కోల్పోయిన వారికి కాపు కాస్తున్నారని దుయ్యబట్టారు. 51 శాతం ఓట్లు సాధించిన ప్రజానాయకుడు జగన్‌ను గుర్తించాలని పెద్దిరెడ్డి అన్నారు.

ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరించారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుబట్టారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని దుయ్యబట్టారు.  గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రులు, అధికారపార్టీ నేత ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్‌ చేశారు. కోవిడ్‌ స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ లాంటివి ప్రబలుతున్న కారణంగా ఎన్నికలు నిలుపుదల చేయాలన్నారు. లేనిపక్షంలో ఎన్నికల విధులు బహిష్కరిస్తామని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతోందని ఇలాంటి సమయంలో నోటిషికేషన్‌ విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం సరికాదని ఉపాధ్యాయ సంఘాల నేత సుధీర్‌బాబు అన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోరని పేర్కొన్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని తాడేపల్లిగూడెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తెలిపారు. గతంలో తక్కువ కరోనా కేసులున్నప్పుడు ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో పంతానికి పోయి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారని చెప్పారు. ఇది సరికాదని ఎమ్మెల్యే సత్యనారాయణ పేర్కొన్నారు. ఎవరి డైరెక్షన్‌లో నిమ్మగడ్డ పనిచేస్తున్నారో అందరికీ తెలుసని తెలిపారు.

గుడ్ న్యూస్..ఏపీకి రివార్డును ప్రకటించిన కేంద్రం,కేంద్రీకృత సంస్కరణల్లో మూడిండిని పూర్తిచేసి మొదటి వరసలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలకు రూ. 1004 కోట్ల రివార్డు

నిమ్మగడ్డ పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నాడని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. శనివారం పలాసలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2018లో ఎన్నికలు నిర్వహించమని హైకోర్టు చెప్పింది. అయితే ఆ రోజున ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల నిమ్మగడ్డ ఆ రోజు ఎన్నికలు నిర్వహించలేదు. అది కోర్టు ధిక్కారం కాదా..? అని నిమ్మగడ్డను ప్రశ్నిస్తున్నా. రాష్ట్రంలో ఒక కేసు ఉన్నప్పుడు కరోనాను సాకుగా చూపించి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు.

ఇప్పుడు కరోనా స్ట్రైయిన్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు. మరోవైపు వ్యాక్సిన్‌ సరఫరా దేశవ్యాప్తంగా మొదలైంది. ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషనర్‌కు ఎందుకంత ఆత్రుత. ఎన్నికలు నిర్వహిస్తే... నీకు, నీ యజమానికి వచ్చే లాభం ఏంటి?. ఒక రాజకీయ దురుద్దేశంతో పని చేస్తున్న నువ్వా మాకు ఎన్నికల కమిషనర్. హోటళ్లలో కూర్చుని రాజకీయాలు చేసే నిమ్మగడ్డకు ఎన్నికల కమిషనర్‌గా అర్హత లేదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ నిర్ణయం ప్రజలను విస్మయానికి గురిచేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని పరిస్థితులను ఎస్‌ఈసీకి అధికారులు వివరించినా పట్టించుకోలేదని.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఎన్నికల నిర్వహణ సాధ్యమా? అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్‌ నిర్ణయం చాలా వివాదాస్పదంగా ఉందని, మొండిగా వ్యవహరించడం సరికాదని ఆయన హితవు పలికారు

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరును వైసీపీ ప్రధాన కార్యదర్శి, శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు తప్పుబట్టారు. కరోనా పేరుతో గతంలో ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ, ఇప్పుడవే పరిస్థితుల్లో ఎన్నికలు జరిపేందుకు షెడ్యూల్ విడుదల చేయడాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో, దేశంలో పరిస్థితులను ఉదాహరిస్తూ, సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రస్తావిస్తూ నాడు ఎన్నికలు వాయిదా వేశారని ధర్మాన వివరించారు.

వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తగదని మంత్రి అవంతి శ్రీనివాస్ హితవు పలికారు. బాబు డైరెక్షన్ లో పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన నిర్ణయం ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టారని అవంతి విమర్శించారు.