Amaravati, Sep 29: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 57,345 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,084 మందికి కరోనా (Corona in AP) పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 13 మంది మృత్యువాత (Covid Deaths) పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,163 కు చేరింది.
ఒకరోజులో 1,328 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం 11,655 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,49,314కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు 2,81,78,305 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,23,496 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా రేపిన కలకలం ఇప్పట్లో ఆగిపోయేలా లేదు. కోవిడ్ కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా, కోట్ల సంఖ్యలో వైరస్ బారినపడిన వారు ఇతర రుగ్మతలు ఎదుర్కొంటున్నారు. మనిషి ఆయుర్దాయంపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్ సంక్షోభంతో మనుషుల సగటు ఆయుష్షు గణనీయంగా పడిపోయిందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా తేల్చారు.
కొవిడ్-19 వైరస్ ఇప్పుడప్పుడే మానవాళిని వదలబోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సీనియర్ అధికారి పూనమ్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు. దీర్ఘకాలం పాటు అది ఇన్‌ఫెక్షన్‌ను వ్యాపింపజేస్తూనే ఉంటుందని చెప్పారు. కొంతకాలానికి మహమ్మారి నుంచి ‘ఎండెమిక్’ స్థాయికి దిగివస్తుందా అన్నది.. టీకాలు, మునుపటి ఇన్‌ఫెక్షన్ ద్వారా సమాజంలో ఉత్పన్నమయ్యే రోగనిరోధకతపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఆ రక్షణను అధికంగా కలిగి ఉన్నచోట్ల భవిష్యత్‌లో వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని పూనమ్ వివరించారు.