Amaravati, August 11: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,030 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,869 మందికి (Corona in AP) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది (Covid Deaths) మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,582 కు చేరింది.
గత 24 గంటల్లో 2,316 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,55,052 మంది ఏపీలో డిశ్చార్జ్ (Recovery Rate) అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 18,417 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 198,57,051 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,53,82,763 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. టీచర్లు సహా, స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాలు యూనిట్‌గా పరిగణలోకి తీసుకుని వ్యాక్సినేషన్ ఇవ్వాలని తెలిపారు.
దీనివల్ల క్రమబద్ధంగా, ప్రాధాన్యత పరంగా వ్యాక్సినేషన్ ఇచ్చినట్టు అవుతుందని, తద్వారా వ్యాక్సిన్లు వృధా కాకుండా మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్యనున్న వారికి కూడా వ్యాక్సిన్లు ఇవ్వాలి కాబట్టి దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎక్కువ ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారు, ఉద్యోగులు, సిబ్బందికి అధిక ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఆలోచనలు చేయాలని ఆయన చెప్పారు.
అనంతరం డిజిటల్ హెల్త్‌పై సమీక్షించిన సీఎం.. ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబసభ్యుల ఆరోగ్య వివరాలు క్యూఆర్ కోడ్ రూపంలో అందుబాటులో ఉండాలన్నారు. విలేజ్ క్లీనిక్స్‌లో కూడా డేటా వివరాల నమోదుతో పాటు ప్రతి విలేజ్, వార్డు క్లీనిక్స్‌లో కూడా కంప్యూటర్ ఉండాలని అధికారులను ఆదేశించారు. విలేజ్ క్లీనిక్స్‌లో సాధారణ పరీక్షలు చేసే పరిస్థితి రావాలని, షుగర్, బీపీ, బ్లడ్ గ్రూప్ సహా ఇతర వివరాలు కార్డులో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో కుటుంబానికి కాకుండా విడివిడిగా వ్యక్తుల పేరుపై ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చే దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు.
ఆరోగ్యశ్రీ, ఆధార్ నెంబర్ చెప్పినా వెంటనే ఆరోగ్య వివరాలు వచ్చే విధానం తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తల్లులు, పిల్లల ఆరోగ్యంపై విలేజ్ క్లీనిక్స్ దృష్టిపెడుతున్నాయి, అదే క్రమంలో గ్రామాల్లో కాలుష్య నియంత్రణపై కూడా దృష్టిపెట్టాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి ట్యాంకుల పరిస్థితులపై పర్యవేక్షణ చేయాలని, ఈ క్రమంలోనే విలేజ్ క్లీనిక్స్ నుంచి టీచింగ్ ఆస్పత్రుల్లో రిక్రూట్‌మెంట్‌పై దృష్టిపెట్టాలని సీఎం పేర్కొన్నారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని రిక్రూట్‌మెంట్ చేయాలని, మూడు నెలల్లో సిబ్బంది భర్తీ ప్రక్రియ పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పీహెచ్‌సీ నుంచి పైస్థాయి ఆస్పత్రులకు కూడా కాంపౌండ్‌వాల్ ఉండాలని తెలిపారు.