COVID19 Outbreak - Representational Image | Photo: FB

Amaravathi, June 18:  ఆంధ్రప్రదేశ్ సెకండ్ వేవ్ కోవిడ్ అదుపులోకి వస్తుంది, ఇటీవల కాలంగా రోజూవారీ కోవిడ్ కేసులు సుమారుగా 6 వేల చొప్పున నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అమలు పరుస్తున్న కర్ఫ్యూ సత్ఫలితాలు ఇచ్చిందని భావించిన ఏపి ప్రభుత్వం, జూన్ 20 తర్వాత కూడా రాష్ట్రంలో కర్ఫ్యూను మరో పది రోజుల పాటు జూన్ 30 వరకు పొడగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కర్ఫ్యూ సమయాన్ని కొంతమేర కుదించారు, ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్న సడలింపులను జూన్ 21 నుంచి సాయంత్రం 6 వరకు పొడగిస్తూ వెసులుబాటు కల్పించారు.  మరోవైపు కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం యథాతథ స్థితినే కొనసాగించాలని నిర్ణయించారు. తూగో జిల్లాలో జూన్ 21 నుంచి కూడా ప్రస్తుతం ఉన్నట్లుగా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సడలింపులు ఉండనున్నాయి.

ఇక, ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,07,764 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 6,341 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 18,39,243కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 18,36,348గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1247 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లా నుంచి 919 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 57 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 12,224కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 8,486 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 17,59,390 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 67,629  ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.