Amaravati, April 21: ఏపీలో ఒక్కరోజు వ్యవధిలో 35 మందిని (Covid Deaths) బలి తీసుకుంది. అదే సమయంలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 37,922 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,987 మందికి పాజిటివ్ (AP Covid Bulletin) అని నిర్ధారణ అయింది. చిత్తూరుతో పాటు నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. అదే విధంగా మరణాల్లోనూ మరింత పెరుగుదల నమోదైంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో ఎనిమిది మంది మరణించగా, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో ఐదుగురు కరోనాతో కన్నుమూశారు.
ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు సంభవించాయి. అదే సమయంలో 3,116 మంది కొవిడ్ బారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,76,987 పాజిటివ్ కేసులు (latest health bulletin) నమోదు కాగా 9,15,626 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 53,889 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్ ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 7,472కి పెరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు తీసింది. నాలుగు రోజుల వ్యవధిలో కుటుంబీకుల్లో ఒకరి తరువాత ఒకరిని బలిగొంది. విజయవాడకు చెందిన న్యాయవాది దినేశ్ కుటుంబీకులు ఇటీవల కరోనా బారినపడ్డారు. చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం దినేశ్ తల్లి, బాబాయి మృతి చెందారు. ఈ విషాదం నుంచి కుటుంబీకులు బయటపడకముందే మంగళవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి దినేశ్ తండ్రి కన్నుమూశాడు. ఆయన అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతుండగానే మధ్యాహ్నం దినేశ్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిలింది.
ట్యాక్సీ, బస్సు డ్రైవర్లు వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ చేపట్టిన విధంగానే, ప్రజలతో నిత్యం సంబంధాలుంటున్న ట్యాక్సీ, బస్సు, ఆటో డ్రైవర్లకు వ్యాక్సిన్ అందించాలన్నారు. జిల్లా కలెక్టర్లు కరోనా నివారణపై యుద్ధ ప్రాతిపదికన అవగాహన కల్పించి కరోనా మరణాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా రోడ్లపైకి వచ్చే వారికి భారీగా జరిమానా విధించి కరోనా కట్టడికి పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో అత్యధికంగా వ్యాక్సినేషన్ అందిస్తున్నారని గుర్తుచేశారు.