Vasireddy Padma

ఏపీ వాలంటీర్ల పట్ల పవన్‌ కల్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్‌ సీరియస్‌ అయ్యింది. ఈ మేరకు పవన్‌కు కమిషన్‌ సమన్లు జారీ చేయనుంది. మహిళలను ఉద్ధేశించి చేసిన పవన్‌ వ్యాఖ్యలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఈమెయిల్స్ ద్వారా మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు.

ఈ క్రమంలో పవన్‌కు నోటీసులు ఇస్తామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. దీనిపై 10 రోజుల్లోపు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. వాలంటీర్లపై పవన్‌ విషం కక్కుతున్నారని, ఆయనకు ఏ ఇంటెలిజెన్స్‌ అధికార చెప్పారో సమాధానం చెప్పాలని అన్నారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి పవన్‌ తప్పించుకోలేరని విమర్శించారు. వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. పవన్‌ చెప్తున్న 30 వేల మిస్సింగ్‌ కేసులకు లెక్క చెప్పాలని డిమాండ్‌ చేశారు. యువత చెడిపోవడానికి పవన్‌ సినిమాలే కారణమని దుయ్యబట్టారు.

వీడియో ఇదిగో, ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్, దీనిపై జగన్ ప్రభుత్వం రివ్యూ ఎందుకు పెట్టడం లేదు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు పవన్‌ అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేస్తున్న తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పవన్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. తమకు తక్షణమే పవన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.