Mangamaripeta Beach Vizag: విశాఖలో ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ, సెంటోసా దీవుల తరహాలో మంగమారిపేట బీచ్‌ను అభివృద్ధి చేయనున్న అధికారులు
AP Government logo (Photo-Wikimedia Commons)

Visakha, August 9: విశాఖ నగరాన్ని పర్యాటక రంగంగా తీర్చి దిద్దేందుకు ఏపా ప్రభుత్వం మరింతగా అడుగులు ముందుకు వేస్తోంది. పర్యాటకంగా విశాఖ నగరాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ టూరిజం అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సెంటోసా దీవుల తరహాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీని అభివృద్ధి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.దీని కోసం విశాఖపట్నం నుంచి 16 కి.మీ, భీమిలి నుంచి 5 కి.మీ దూరంలో ఉన్న మంగమారిపేట బీచ్‌ను (Mangamaripeta Beach Vizag) అధికారులు ఎంపిక చేశారు.

మంగమారిపేట బీచ్‌లో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీకి రూపకల్పన చేశారు. ఈ మెగా టూరిజం కాంప్లెక్స్‌లో మొత్తం 24 విభిన్న తరహా టూరిజం ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రూ.700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న భీమిలి–భోగాపురం ఆరులైన్ల గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌కు అనుసంధానంగా ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ రూపుదిద్దుకోనుంది.

వణికిస్తున్న వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు తప్పని భారీ వర్షాల ముప్పు, నేడు అల్పపీడనం మరింతగా బలపడే అవకాశం

జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా అత్యాధునిక టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంతో పాటు.. ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించడం మొదలైన అంశాలతో టూరిజం అధికారులు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఒకే కాంప్లెక్స్‌లో పార్కింగ్, ఫుడ్‌ కోర్టులు, ఇతర మౌలిక వసతులు కల్పించడం వల్ల ప్రాజెక్టు వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఏపీయూఐఎఎంఎల్‌) సహకారంతో ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది.

ఇప్పటికే ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీలో రానున్న కొన్ని ప్రాజెక్టులకు రాష్ట్ర కేబినెట్‌ ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. జెయింట్‌ వీల్, స్నో పార్క్, స్కై టవర్, టన్నెల్‌ అక్వేరియం వంటి ప్రధాన ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోదం లభించింది. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను రూపొందించిన తర్వాత.. కేబినెట్‌ ముందుకు ఈ ఫైల్‌ రానుంది. కేబినెట్‌ ఆమోదం లభించిన తర్వాత మెగా టూరిజం కాంప్లెక్స్‌కు వేగంగా అడుగులు పడనున్నాయి.