Amaravati, Mar 3: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సంబంధించిన శాఖలను ( Mekapati Goutham Reddy's portfolios) ఇతర మంత్రులకు కేటాయించారు. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్, ఎన్ఆర్ఐ ఎంపవర్‌మెంట్ కేటాయించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల వ్యవహారాలను సదరు మంత్రులు చూడనున్నారు.
పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గత సోమవారం గుండెపోటుతో మరణించారు. దాంతో అసెంబ్లీ సమావేశాల ( AP assembly sessions) సందర్భంగా ఆయన చూసిన శాఖల వ్యవహారాలను కొత్తగా కేటాయించిన మంత్రులు చూసుకుంటారు. మార్చి 7న ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే గౌతమ్‌రెడ్డి చూసిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.
దీంతో అసెంబ్లీలో ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు, చర్చలో పాల్గొనేందుకు మంత్రులకు వీలుంటుంది. మరోవైపు ఆత్మకూరు ఉప ఎన్నికకు ముందు గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యుల్లో ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.