Amaravati, April 22: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రియుడితో పాటు మరో ఇద్దరు లైంగికదాడికి ( woman sexually assaulted in Vijayawada) పాల్పడ్డారు. ప్రియురాలు మానసిక స్థితి బాగలేదని ఇంటి నుంచి తీసుకెళ్లిన ప్రియుడు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు.
తమ కూతురు కనిపించడం లేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి నిందితుడి ఫోన్ నంబర్ ఇచ్చినా పోలీసులు స్పందించకపోవడంతోనే లైంగికదాడి జరిగిందని బాధితురాలి సోదరుడు వాపోయాడు. తమ సోదరికి ఎలాంటి మానసిక సమస్యలు లేవని తెలిపాడు. కాగా న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై అత్యాచారం కేసులో ఇద్దరు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో అలసత్వం వహించారంటూ సీఐ హనీష్, సెక్టార్ ఎస్ఐ శ్రీనివాసరావును సీపీ సస్పెండ్ చేశారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటనలో ముందుగా ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పోలీసులు అలసత్వం వహించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.డీజీపీ కార్యాలయం ఈ సంఘటనపై నివేదిక తెప్పించుకున్న అనంతరం.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు వచ్చిన ఇద్దరు పోలీస్ అధికారులు సీఐ హనీష్, సెక్టార్ ఎస్ఐ శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విజయవాడ సీపీకి ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు సీఎంఓ అధికారులకు ( orders for full-length probe) ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ఆ కుటుంబానికి కూ.10 లక్షల పరిహారం ( ex-gratia of Rs. 10 lakh) వెంటనే ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలపై ఒక సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ కూడా చర్యలు ప్రారంభించింది.