Vizag, Feb 15: మూడు రాజధానుల నిర్ణయానికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం (YSRCP Govt) కట్టుబడి ఉందని మంత్రి అంబటి రాంబాబు మరోమారు స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష‍్యమని చెప్పారు. భవిష్యత్తులో సమస్యలు మళ్లీ పునరావృతం కాకూడదు అంటే రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని పేర్కొన్నారు.
'వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విధానం మూడు రాజధానులే (Three Capitals) దీనికి కారణమేమిటంటే సమతుల్యం. మూడు ప్రాంతాలను సమానంగా చూసుకోవాలనే భావన. ఇంతకుముందు మనకు ఈ రాష్ట్రంలో చాలా అనుభవాలు ఉన్నాయి. రీజినల్ ఫీలింగ్స్ ఉన్నాయి. దాని వల్ల ఒకసారి దెబ్బతిన్నాం. తెలంగాణ ఫీలింగ్‌తో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వంటి గొప్ప ప్రదేశాన్ని మనం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నీ అక్కడే ఉన్నాయి.
కానీ అలా ఉండకుండా అన్ని చోట్లా అభివృద్ధి జరగాలనే సదుద్దేశంతో ఒక శాస్త్రీయమైన పద్ధతిలో మూడు రాజధానులు అవసరం. మూడు రాజధానులంటే ఒకటి రాయలసీమకి, ఒకటి కోస్తా ఆంధ్రకి, ఒకటి ఉత్తరాంధ్రకి ఇచ్చి అన్ని ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచడంతో పాటు, ఓన్ చేసుకునే విధానాన్ని చేయటం. దీని వల్ల భవిష్యత్తులో ఏ విధమైన ఆందోళన, అభద్రతా భావం ఏ ప్రాంతానికీ ఉండకూడదనే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది తప్ప మరొకటి కాదు. అది మా పాలసీ. ఆ పాలసీకే కట్టుబడి ఉన్నాం. మీరు దాని గురించి సందేహపడాల్సిన అవసరం లేదు.' అని అంబటి అన్నారు.
విశాఖ పరిపాలన రాజధాని: సజ్జల
అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ విధానం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఏపీ సచివాలయం మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ, విశాఖ.. పరిపాలన రాజధానిగా ఉంటుందని, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందన్నారు. పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలను ఎల్లో మీడియా కన్ప్యూజ్ చేస్తోందని సజ్జల మండిపడ్డారు. ‘‘రియల్ ఎస్టేట్ కోసం కొందరు వాదనలు చేస్తున్నారు. ఎవరూ అపోహలకు గురికావాల్సిన పనిలేదు. కొందరు కావాలనే అయోమయం సృష్టిస్తున్నారు. ఎన్నికల కోసం మేం రాజకీయం చేయబోం. ఎన్నికలుంటే ఒకమాట, లేదంటే మరోమాట చెప్పం. అధికార వికేంద్రీకరణ చేయాలని శివరామకృష్ణ కమిటీ చెప్పలేదా?. వచ్చిన అవకాశాన్ని వదులుకుని చంద్రబాబు ఘోర తప్పిదం చేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.