Visakha, June 12: విశాఖపట్నం సభలో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ వన్ అని కేంద్రం ప్రకటనలు ఇస్తుంటే, ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని అమిత్ షా వ్యాఖ్యానించడం సరికాదని కారుమూరి పేర్కొన్నారు.
నిన్న అమిత్ షా విశాఖ సభలో వేదికపై ఉన్నవారంతా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారే ఉన్నారని, వారి మనస్సు ఒక చోట, మనుషులు మరో చోట ఉన్నట్టుందని విమర్శించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆయన సొంతంగా అన్నట్టు లేవని, ఎవరో ఆయన చెవిలో ఊదిన విషయాలనే మాట్లాడినట్టుందని మంత్రి కారుమూరి ఆరోపించారు.
రైతులు ఏళ్ల తరబడి కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు... దీని పట్ల అమిత్ షా సిగ్గుపడాలని అన్నారు. అమిత్ షా గతంలో తిరుపతి పర్యటనకు వస్తే టీడీపీ నిరసన ప్రదర్శనలు చేపట్టిందని, ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడలేదా? అని కారుమూరి ప్రశ్నించారు. ఎంతమంది కలిసొచ్చినా సీఎం జగన్ ను ఏమీ చేయలేరని, రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతి ఇంట్లో మనిషిలా మారారని వెల్లడించారు.
టీడీపీ ట్రాప్‌లో బీజేపీ: అమిత్‌షా వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి స్పందన
బీజేపీ.. టీడీపీ ట్రాప్‌లో పడిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విశాఖపట్నంలో మీడియాలో మాట్లాడుతూ, ‘‘టీడీపీ నేతల మాటలనే అమిత్‌షా చెప్పారు. అమిత్‌షా సభా వేదికపై ఉన్నవారంతా టీడీపీ నేతలే. వారంతా పసుపు కండువా తీసి కాషాయ కండువా వేసుకున్న నేతలే’’ అని సుబ్బారెడ్డి మండిపడ్డారు.
‘‘2014-19 వరకు టీడీపీతో కలిసున్న బీజేపీ అప్పుడు ఏం చేసింది?. టీడీపీ అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం లేదా?. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అమిత్‌షా ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.