Perni-Nani

Amaravati, Mar 15: ఏపీ మంత్రి పేర్ని నాని జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు (Pawan Kalyan's Remarks) కౌంటర్ ఇచ్చారు. రాజకీయ జీవితం ఇచ్చిన చిరంజీవికి నమస్కారం పెట్టకపోవడం పవన్ సంస్కారం అని వ్యంగ్యం ప్రదర్శించారు. చిరంజీవి లేకుండా పవన్ కల్యాణ్ ఉన్నారా? అని ప్రశ్నించారు. టీడీపీ బాగుండాలనేదే పవన్ ఆకాంక్ష అని, పవన్ ఎప్పుడు తమ పార్టీలోకి దూకుతాడా అని టీడీపీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని అన్నారు.

ఇవాళ సభలో పవన్ మాట్లాడిన మాటలు వింటుంటే... కంఠం పవన్ ది, భావం చంద్రబాబుది అన్నట్టుగా ఉందని పేర్ని నాని (Minister Perni Nani) విమర్శించారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదన్నదే పవన్, చంద్రబాబు లక్ష్యం అని తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని పవన్ (Pawan Kalyan) ఒక్క మాట కూడా అనలేదని ఆరోపించారు. పవన్ కల్యాణ్ ను నడిపించే శక్తి బీజేపీనే అని, అలా కాకపోతే విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తుంటే ప్రశ్నించాలి కదా! అని వ్యాఖ్యానించారు.

కులాల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్... ఇవాళ వైసీపీలో ఎంతమంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంతమంది కమ్మ ఓటర్లు, ఎంతమంది సానుభూతిపరులు ఉన్నారో గమనించాలని హితవు పలికారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదని ఇప్పుడే అనిపించిందా? అని పవన్ ను ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఓ రాజకీయ ఊసరవెల్లి అని పేర్ని నాని అభివర్ణించారు. వైసీపీకి కమ్మవాళ్లను ఎందుకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ నిలదీశారు.

పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ చిత్తుచిత్తుగా ఓడింది, ఏపీకి మరో రెండు సార్లు జగన్‌ సీఎంగా కొనసాగాలి, అప్పుడే రాష్ట్రం స్వర్ణాంధ్ర అవుతుందని తెలిపిన సినీ నటుడు సుమన్

ఈ సారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేది లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారని, తద్వారా చంద్రబాబును సీఎం చేయాలన్న ఆయన తాపత్రయం వ్యక్తమవుతోందని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. జగన్ ను ఓడించేందుకు బీజేపీ నుంచి దిశానిర్దేశం కోసం వెయిటింగ్ అని పవన్ అంటున్నారని, జగన్ పై విషం చిమ్మడం ఒక్కటే వీరి అజెండా అని, అంతకుమించి పవన్ కు మరో అజెండా లేదని స్పష్టం చేశారు. జగన్ ను దించేందుకు రాజకీయ దుష్టశక్తులన్నీ ఏకమవుతున్నాయని, చేతబడులు చేసేవారందరూ కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. ఎంతమంది ఎదురొచ్చినా జగన్ ఒంటరిగానే పోరాడతారని పేర్ని నాని స్పష్టం చేశారు.

జనసేన కార్యకర్తలకు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోందని, ఎప్పుడు ఎవరికి ఓటు వేయాలని చెప్పాలో వారికి అర్థంకావడంలేదని వ్యంగ్యం ప్రదర్శించారు. "గతంలో సైకిల్ కు ఓటేయాలని చెప్పారు. మొన్నేమో కమలం, నిన్న మన గ్లాసు, ఒక ఊర్లోనేమో కత్తి సుత్తి, మరొక ఊర్లోనేమో కంకి కొడవలి, ఒక ఊర్లో ఏనుగు, ఇంకో ఊర్లో బాణం... ఇలా ఎప్పుడు ఏ గుర్తుకు ఓటేయమంటారో తెలియదు. రేపొద్దున మళ్లీ సైకిల్ అంటున్నాడు. జనసేన కార్యకర్తలకు ఎన్ని కష్టాలో పాపం. కానీ వైసీపీ కార్యకర్తలకు ఆ బాధ లేదు. ఉన్నది ఒకటే ఫ్యాన్ గుర్తు. మీకంటే ఊసరవెల్లి నయం పవన్ కల్యాణ్ గారూ.

ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌, సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని సీఎం జగన్ ఆగ్రహం

ఇంకొకటి మర్చిపోయామండోయ్... అందరికీ నమస్కారం పెట్టాం కానీ లింగమనేని గారికి నమస్కారం పెట్టలేదు. పాపం ఏం చేశాడాయన? ఆఫీసుకు స్థలం ఇచ్చాడు. ఇంకెక్కడో బిల్డింగ్ కు అద్దె కడుతున్నాడు. ఇంకా ఏవేవో చేస్తున్నాడు... కానీ ఆయనకు కూడా నమస్కారం లేదు. ఇక న్యాయవ్యవస్థ గురించి కూడా పవన్ అన్యాయంగా మాట్లాడారు. దేశం మొత్తం ప్రఖ్యాతిగాంచిన రిటైర్డ్ జడ్జి చంద్రుడు అనే వ్యక్తి గురించి టీడీపీ వాళ్లు బూతులు తిడితే మీరేం చేశారు? సినిమా డైలాగులే ఇవాళ సభలో మాట్లాడారు. అలాంటప్పుడు... నేను సింగిల్ కాదు చంద్రబాబుతో మింగిల్ అని చెప్పొచ్చు కదా.

జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలు అయితే, చంద్రబాబు చెప్పినట్టే మాట్లాడుతున్నాడు. టీడీపీ వాళ్లు అప్పు చేస్తే తప్పు కాదట... జగన్ మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే తప్పు అంటున్నాడు. మోదీ, అమిత్ షా వంటి వాళ్లు కేంద్రంలో అప్పులు చేయడంలేదా? మీ బీజేపీ వాళ్లు అప్పులు చేయకుండానే పరిపాలన చేస్తున్నారా? ఇప్పుడు కొత్తగా నామాలు పెట్టుకుని హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. మీరు, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం నడిపినప్పుడు హిందూ దేవాలయాల ధ్వంసం జరిగితే ఏనాడన్నా నోరు మెదిపారా?" అని నిలదీశారు. పవన్ కల్యాణ్ ఏపీకి ఓ గెస్టులా, టూరిస్టులా మారారని, వచ్చి వెళ్లడం తప్ప ఏం చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు నిజాయతీ ఉంటే చంద్రబాబు కోసమే పనిచేస్తున్నానని చెప్పాలని డిమాండ్ చేశారు.

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ ఏమన్నారు

జనసేన పార్టీ స్థాపించి నేటికి ఎనిమిదేళ్లు (Jana Sena Formation Day) పూర్తయింది. పార్టీ 9వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా అమరావతి ప్రాంతంలోని ఇప్పటం వద్ద జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను (Jana Sena Formation Day at Ippatam) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన అగ్రనేతలతో పాటు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఆయన తన ప్రసంగాన్ని జై ఆంధ్రా, జై తెలంగాణ, జై భారత్ అంటూ ప్రారంభించారు. లోక కల్యాణం కోరే హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ మత పెద్దలకు, నిత్యం రామకోటి రాసే స్త్రీమూర్తులకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు.

"కొదమ సింహాల్లాంటి జనసైనికులు, ఆడబెబ్బులి వంటి వీరమహిళలకు శుభాభినందనలు. ఈ సభను మా పొలాల్లో జరుపుకోండి అని సహకరించిన ఇప్పటం రైతులకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ సభ పెట్టుకోండి అని సహకరించిన మీకు ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. ఇప్పటం గ్రామానికి నా ట్రస్టు తరఫున రూ.50 లక్షలు ప్రకటిస్తున్నాను. అలాగే, సభ నిర్వహణకు అనుమతినిచ్చిన అధికారులకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసిన పోలీసు అధికారులకు, నా సోదరులైన పోలీస్ కానిస్టేబుళ్లకు, తోటి భీమ్లానాయక్ లైన మా ఎస్సైలకు... మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ వ్యాఖ్యానించారు.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ అధికార పార్టీపై విమర్శల దాడిచేశారు. ఆద్యంతం వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. చివరగా కొన్ని మాటలు చెప్పి ప్రసంగాన్ని ముగిస్తున్నానంటూ ఆవేశపూరిత సందేశం వినిపించారు. పొరుగువాడి మంచితనం దుష్టుడి దురహంకారాన్ని రెచ్చగొడుతోంది. పక్కవాడి సౌభాగ్యం బాలిశుడి గుండెల్లో మంటలు రేకెతిస్తోంది. ప్రజల నోళ్లు కొట్టి, ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి గజదొంగలు రాజులై రారాజులై ఏలుతున్నారు.

దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన ఈ కవితాపంక్తులు వర్తమాన వైసీపీ పాలకులకు చాలా సహజంగా వర్తిస్తాయి... కర్ణుడికి కవచ కుండలాల్లాగా అతికినట్టు సరిపోతాయి. బాలిశుడు అంటే మూర్ఖుడు.. నా ఉద్దేశంలో దుర్మార్గుడు అని అర్థం. అధికార మదంతో ఒళ్లు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ అనబడే మహిషానికి కొమ్ములు విరగ్గొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. ఇదే జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ యొక్క లక్ష్యం ఉద్దేశం!" అని వ్యాఖ్యానించారు.

అలాగే, బీజేపీ నేతలు, పెద్దలు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారని, ఆ రోడ్ మ్యాప్ ఎప్పుడిస్తారో చెబితే వైసీపీని ఎలా దించాలో తాము చూసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని, పార్టీలు, వ్యక్తిగత లాభాలు వదిలేసి రాష్ట్ర ప్రయోజనాల వద్దకు వచ్చినప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తామని వెల్లడించారు.

"కూల్చేవాడుంటే కట్టే వాడుంటాడు... విడదీసేవాడుంటే కలిపేవాడుంటాడు... చీకట్లోకి తోసేవాడుంటే వెలుగులోకి లాక్కొచ్చేవాడుంటాడు... తలెగరేసే పాలకుడుంటే ఎగిరి తన్నే పరశురాముడు ఉంటాడు... దోపిడీ చేసే వైసీపీ గూండా గాళ్లు ఉంటే వారి దోపిడీని అడ్డుకునే జనసైనికులు ఉంటారు... వైసీపీది విధ్వంసం జనసేనది విఘాతం. వారిది ఆధిపత్యం... మనది ఆత్మగౌరవం. అది అహంకారానికి అడ్డా.... ఇది జనసైనికుల గడ్డ... జై జనసేన" అంటూ పవన్ కల్యాణ్ ప్రసంగం ముగించారు.

వైసీపీ పాలన అశుభంతో ప్రారంభమైందని అన్నారు. ఎవరైనా కొత్తింట్లోకి వెళితే కొబ్బరికాయ కొట్టి, దీపం వెలిగించి శుభం కోరుకుంటామని తెలిపారు. కానీ, వైసీపీ వచ్చీ రావడంతోనే కూల్చివేతతో మొదలుపెట్టిందని, అశుభంతో ప్రారంభించిందని విమర్శించారు. వైసీపీ నేతలపై తనకేమీ వ్యక్తిగత ద్వేషాలు ఉండవని, వారి విధానాలపైనే తన పోరు అని స్పష్టం చేశారు. 151 సీట్లు గెలిస్తే ఎంత బాగా పరిపాలిస్తారోనని ఆసక్తిగా చూశానని, కానీ ఇసుక పాలసీతోనే వారి నైజం బట్టబయలైందని అన్నారు. ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల 32 నిండు ప్రాణాలు బలయ్యాయని పేర్కొన్నారు.

"అప్పటి నుంచి నిన్న మా సభకు ఆటంకం కలిగించే దాకా చూస్తే ఇంత నెగెటివ్ మనుషులేంట్రా బాబూ, ఇంత విధ్వంసపూరిత ఆలోచనలేంటి అనిపిస్తుంది. అసలు వీళ్లేమనుకుని రాజకీయాల్లోకి వచ్చారో అర్థంకావడంలేదు. పైడిమర్రి సుబ్బారావు గారు రాసిన ప్రతిజ్ఞలో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ఉంటుంది. మరి వైసీపీ వాళ్లు కూడా ఏదో ఒక ప్రతిజ్ఞ చేసుకోకపోతే ఇంత దరిద్రం చేయరు కదా! వాళ్లు కూడా ఏదో ఒక ప్రతిజ్ఞ చేసుకునే రాజకీయాల్లోకి వచ్చుంటారు.

ఆ ప్రతిజ్ఞ ఎలా ఉంటుందంటే... ఆంధ్రప్రదేశ్ మా సొంత భూమి. ఆంధ్రులందరూ మా బానిసలు. రాజ్యాంగస్ఫూర్తిని తుంగలో తొక్కుతాం. న్యాయవ్యవస్థను లెక్కే చెయ్యం. పోలీసులను ప్రైవేటు సైన్యంగా వాడేస్తాం. ఉద్యోగులను ముప్పుతిప్పలు పెడతాం, మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం. నిరుద్యోగులకు మొండిచేయి చూపిస్తాం. రాష్ట్ర రహదారులను గుంతలమయం చేస్తాం. ప్రజల వెన్నుపూసలు విరగ్గొడతాం. అలా విరగ్గొట్టేంత వరకు విశ్రమించం.

రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్లో 50 శాతం వాటా మేం లాక్కుంటాం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి ఆర్థికమూలాలను దెబ్బకొడతాం. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉంటామని చెబుతాం... కానీ అధికారంలోకి రాగానే వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తాం, వారు ఆత్మహత్యలు చేసుకుంటామంటే ప్రోత్సహిస్తాం. ఇసుకను అప్పడంలా కరకర నమిలేస్తాం. సహజ వనరులను మొత్తం వాడేసుకుంటాం. దేవతా విగ్రహాలను ధ్వంసం చేసేవారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాం. గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసేస్తాం. పార్కులు, స్కూళ్లు, ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టేస్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూనే ప్రజలను చిత్తుగా తాగిస్తాం. మా వైసీపీ ఆదాయ వనరులను పెంచుకుంటాం. ఎవడన్నా గొంతెత్తితే... చావగొడతాం, కేసులు పెడతాం, లాఠీలతో చితగ్గొట్టిస్తాం... మా వైసీపీ ఎంపీ అయినాసరే!

ఒక్క చాన్సు.... ఒక్క చాన్సూ... ఒక్క చాన్సిస్తే ఆంధ్రాను పాతికేళ్లు వెనక్కి తీసుకెళతాం. ఇంకొక్క చాన్సిస్తే స్కూలుకెళ్లే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు లాగేసుకుంటాం... ఇదీ వైసీపీ నేతల ప్రతిజ్ఞ!" అంటూ పవన్ కల్యాణ్ తనదైన శైలిలో సభికులను ఉర్రూతలూగించారు.