Amaravathi November 27: గత కొద్దిరోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంద్రప్రదేశ్‌కు (Andhra Pradesh) మరోసారి వర్షసూచన ఉందని ఐఎండీ(IMD) హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే సూచన ఉందని, ఇది క్రమంగా బలపడి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి 30వరకు రాయలసీమలోని చిత్తూరు(Chittoor), నెల్లూరు(Nellore) జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో 13 సెం.మీ కంటే ఎక్కువ వర్షం కురిసే సూచనలున్నాయని ఐంఎడీ హెచ్చరించింది. డిసెంబర్ 2వరకు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
వాతావరణ శాఖ హెచ్చరికలతో చిత్తూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భావిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కాజ్‌వేలు దాటొద్దని కోరారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అటు తమిళనాడు(Tamilnadu), పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణశాఖ అధికారులు.