nivar cyclonic storm to hit Telugu States with heavy rains (Photo Credits: PTI)

Amaravati, Nov 26: నైరుతి బంగాళాఖాతం దాని పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా (Low Pressure) మారకుండా అలాగే కొనసాగుతోంది. ఇది తమిళనాడు, శ్రీలంక వైపు ప్రయాణిస్తుండడంతో రాయలసీమకు వర్షాల ముప్పు తప్పినట్లేనని వాతావరణశాఖ అధికారులు (IMD) తెలిపారు. ఇది నిన్న అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసినా.. ఇంకా అలాగే కొనసాగుతోంది. శ్రీలంక, తమిళనాడులోని కడలూరు, చెన్నై తీరం వైపు ఇది కదులుతుండడంతో అక్కడ భారీవర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

దీంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం లేదు. 26వ తేదీ నుంచి పలుచోట్ల భారీవర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని, 28, 29 తేదీల్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు దక్షిణ అండమాన్‌ సముద్రంలో 29వ తేదీనాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అయితే తమిళనాడు, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా రాయలసీమలపై బలమైన తూర్పు గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆయా ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 29న అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడి రెండు రోజుల పాటు పశ్చిమ వాయవ్యంగా పయనిస్తుందని అమరావతి వాతావరణం కేంద్రం వెల్లడించింది. 28, 29 తేదీల్లో మాత్రం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలకు అవకాశం ఉందని వివరించారు.

ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాల ముప్పు, నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం

తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాతావరణ కేంద్రం తిరునల్వేలి, తెన్‌కాశి, తూత్తుకుడి జిల్లాలకు ‘రెడ్‌ అలర్ట్‌’ (Red alert issued, ‘heavy’ rains ) ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షం పడింది. ప్రధానంగా తిరునల్వేలి, పుదుకోట, విల్లుపురం, రామనాథపురం, తూత్తుకుడి, శివగంగై, మదురై జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు తదితర జిల్లాల్లోనూ గురువారం ఓ మోస్తరు వర్షం కురసింది.

అయితే, శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా దిండుగల్‌, అరియలూరు, విరుదునగర్‌, తిరునల్వేలి, తూత్తుకుడి, పుదుకోట జిల్లాల్లో అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించడంతో శుక్రవారం పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు. జాలర్లు కూడా సముద్రంలోకి చేపలవేటకు వెళ్ళొద్దని సూచించారు. కాగా, తూత్తుకుడి జిల్లాలో గురువారం సాయంత్రానికి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడన ద్రోణి స్థిరంగా ఉంది. నిజానికి ఈ ద్రోణి మరింతగా బలపడి వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు దిశగా ప్రయాణిస్తుందని తొలుత అంచనావేశారు. కానీ, గాలివేగం దిశ మారడంతో ఈ అల్పపీడనం అక్కడే స్థిరంగా కొనసాగుతోందని, ఈ నెల 29వ తేదీన బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. అయినప్పటికీ వచ్చే రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

నైరుతి దిశలో వీస్తున్న గాలుల వేగం మందగించడం, ఉత్తర భారతదేశం నుంచి బంగాళాఖాతం వైపు వచ్చే చలిగాలుల కారణంగా శ్రీలంకకు సమీపంలోని కేంద్రీకృతమైన అల్పపీడన ద్రోణి బలపడకుండా స్థిరంగా కొనసాగుతోంది. గాలివేగం దిశ మారడం వల్ల ఒక వేళ ఇది శ్రీలంక, పుదుకోట, కన్నియాకుమారి మీదుగా అరేబియా సముద్రం వైపు వెళ్ళవచ్చని భావిస్తున్నారు. శ్రీలంకకు సమీపంలో ఉన్న ఈ అల్పపీడన ద్రోణి వచ్చే 48 గంటల్లో వాయుగుండంగా మారి వాయువ్య దిశగా పయనించి అరేబియా సముంద్రం ప్రాంతంలో తీరాన్ని దొటవచ్చని భావిస్తున్నారు. ఈ కారణంగా ఉత్తర తమిళనాడు, కోస్తాతీర జిల్లాలు, డెల్టా జిల్లాల్లో ఈ నెల 29వ తేదీన భారీ వర్షం పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.