Amaravathi, September 20: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాయాల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్ష (AP Grama Sachivalayam Exams) లను చాలా పకడ్బందీగా నిర్వహించామని ఏపీ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన పశ్నాపత్రాల లీక్ కు సంబంధించి వస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. ఈ పరీక్షలను తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని వివరించిన మంత్రి, పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించామని వెల్లడించారు. అసలు ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చే అవకాశమే లేదని తేల్చిచెప్పారు.
ఈ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీయడానికే కొంతమంది పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలకు సంబంధించి అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని పెద్దిరెడ్డి భరోసా ఇచ్చారు. ఏపీ గ్రామ సచివాలయ ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
కాగా.. సచివాలయ పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని "ఆంధ్రజ్యోతి" పత్రిక శుక్రవారం రోజు సంచలన వార్త ప్రచురించింది. ఈ పరీక్ష నిర్వహించిన APPSC ఉద్యోగులే పరీక్షలు రాశారని ఆరోపించింది. గురువారం ప్రకటించిన ఫలితాలలో కేటగిరి-1లో టాప్-1 ర్యాంకర్ (జి.అనితమ్మ, అనంతపురం) APPSC మహిళా ఉద్యోగిణి అని ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది. ఈ ఫలితాలలో మెరుగైన ఫలితాలు సాధించిన వారందరూ APPSC ఉద్యోగులకు సంబంధించిన బంధువులే, పరీక్షల్లో అర్హత సాధించిన ఎక్కువ మందిలో ఉద్యోగులకు సంబంధించిన వారే అధికశాతం ఉన్నారని పేర్కొంది.
తాజాగా, మంత్రి పెద్దిరెడ్డి ఈ వార్తలను ఖండించినప్పటికీ, దీనిపై ఏపీ ప్రభుత్వం రహస్య విచారణ చేపట్టిందని 'ఏబిఎన్' ఛానెల్ వెల్లడించింది.
చంద్రబాబుపై కాపు ఉద్యమ నేత ఫైర్
ఇక మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోడెల అంతిమ యాత్ర జరుగుతున్నపుడు చంద్రబాబు నటన చూశానని, ఈ నటనంతా ప్రజల సానుభూతి కోసమేనా? అని ముద్రగడ ప్రశ్నించారు. అంతిమయాత్రకు వచ్చినపుడు మౌనంగా ఉండాలి లేదా నమస్కారం చేయాలి, అలాకాకుండా రెండు వేళ్లు (విక్టరీ సింబల్) చూపించడం మీ సంస్కారమా? అంటూ ముద్రగడ ఎద్దేవా చేశారు. కిర్లంపూడిని పాకిస్థాన్‌లా, కాపులను ఉగ్రవాదుల కింద ముద్రవేసింది మీరు కాదా? అని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మీరు, మీ హయాంలో పెట్టిన కేసుల గురించి మరిచిపోయారా? మీ రాక్షస పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, మనుషులను హీనంగా చూసింది మీరు కాదా? అని ప్రశ్నలు కురుపించారు. ఇంతతి ఘనమైన చరిత్ర కలిగిన చంద్రబాబు మళ్ళీ రాష్ట్రం కోసమే బ్రతుకుతున్నానంటూ, మొసళి కన్నీరు కారుస్తూ ఇలా ఎంతకాలం నటిస్తారో చెప్పాలంటూ చంద్రబాబును ఘాటుగా ప్రశ్నించారు ముద్రగడ.