Krishna, June 13: ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్లలో దారుణం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ తన భార్య మీద దాడిచేసి తీవ్రంగా కొట్టాడు. వత్సవాయి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సునీల్ అనే వ్యక్తి తన భార్య నవ్య పై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో నవ్య ను బంధువుల సహాయంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా సునీల్ తల్లి అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ కావడంతో.. ఆ అండ చూసుకొని తనపై దాడి చేశారని నవ్య చెబుతోంది. ‘మా అత్తయ్య గ్రామ సర్పంచ్ కావడంతో.. నీకేమైనా నేను చూసుకుంటా.. ఒక మహిళని కొట్టలేక పోతున్నావా’ అని సునీల్ ను రెచ్చగొట్టి నాపై దాడి చేసి హత్యా ప్రయత్నం చేశారని నవ్య ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే సునీల్ కు జగ్గయ్యపేటకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం ఉందని.. వారికి అడ్డుగా ఉన్నాననే నాపై హత్యాప్రయత్నం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవ్య ఫిర్యాదుతో కేసు నమోదు (Police Constable Booked on Charges) చేశారు. కంచికచర్ల సబ్ ఇన స్పెక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ.. నిందితుడిపై సెక్షన్ 498ఏ కింద అలాగే ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని దీనిపై దర్యాప్తు జరగుతోందని తెలిపారు. ప్రజలకు రక్షణ ఉండవలసిన పోలీస్ అయిన సునీల్ మహిళపై తీవ్రంగా దాడి చేయడాన్ని, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ అతని పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాయి.