Mangalagiri, Feb 20: అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది నెలల్లో సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా వైసీపీ నుండి గెలిచి ఆ తర్వాత రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) మళ్లీ వైసీపీలో చేరనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మంగళవారం నాడు.. ఆయన సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ (CM Jagan)ను కలిసే అవకాశమున్నట్లు సమాచారం. గత రాత్రి ఆర్కేతో ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) సుదీర్ఘ మంతనాలు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కిందటి ఏడాది డిసెంబర్‌లో పార్టీకి.. మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఆర్కే చేశారు. తాజాగా రానున్న ఎన్నికల్లో( Andhra Pradesh Elections 2024) మంగళగిరి నియోజకవర్గ గెలుపు బాధ్యతల్ని ఆర్కేకు (Mangalagiri Former MLA Alla Ramakrishna Reddy) అప్పగించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మంగళగిరి ఇన్‌ఛార్జిగా గంజి శ్రీనివాస్‌ను వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఎంపిక చేసింది. మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ను ఓడించడమే లక్ష్యంగా తాడేపల్లి పెద్దలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఆర్కే మళ్లీ పార్టీలోకి వస్తే మంగళగిరిలో వైసీపీ మరింత బలంగా మారుతుందని పెద్దలు భావిస్తున్నారు.
షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి...
ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా రెండుసార్లు 2014, 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై విజయం సాధించారు. అయితే రెండో సారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు సీఎం జగన్ చోటు కల్పించకపోవడంతో చాలా రోజుల నుంచి ఆర్కే అసంతృప్తితోనే ఉన్నారు. తర్వాత గంజి చిరంజీవిని పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించడంతో మనస్తాపం చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.