Kotamreddy Sridhar Reddy: ప్రజా ఉద్యమాలను ఆపలేరు, ఇక నుంచి గెరిల్లా తరహాలో ఉద్యమాలు చేస్తామని కోటం రెడ్డి హెచ్చరిక, గృహనిర్బంధం చేసిన పోలీసులు
Kotamreddy Sridhar Reddy (Photo-Video Grab)

Nellore, May 23: వైసీపీ నుంచి ఉద్వాసనకు గురైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేస్తూనే ఉంటానని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే అన్నారు. ప్రజా ఉద్యమాలను ఆపలేరని చెప్పారు. గాంధీనగర్‌లో క్రిస్టియన్‌ కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం నిరసన తెలపనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై ఇక నుంచి ముందస్తు హెచ్చరికలు లేకుండా గెరిల్లా తరహాలో ఉద్యమాలు చేస్తామన్నారు. క్రిస్టియన్ల కోసం కమ్యూనిటీ హాలు నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారు. రూ.7కోట్ల నిధులు కావాలంటే అందుకు సీఎం జగన్‌ అంగీకరించారు. నిధులు ఇవ్వాలని కోరుతూ ఇచ్చిన మూడు వినతిపత్రాలపై సీఎం సంతకాలు చేశారు. నాలుగేళ్లవుతున్నా నిధులు మాత్రం రాలేదు. సీఎం కార్యాలయానికి క్రిస్టియన్ల నుంచి విజ్ఞప్తులు పంపించాం. అయినా స్పందించకపోవడంతోనే నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు.

చంద్రబాబు సై అంటే ఎక్కడినుంచైనా పోటీ చేస్తా, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు, నెల్లూరులో అన్ని సీట్లు గెలుస్తామని జోస్యం

శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే అడ్డుకోవడం ఎంతవరకు సబబు? నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉన్నా. ప్రభుత్వం అడ్డుకున్నా.. ప్రజా సమస్యలపై గళం విప్పుతూనే ఉంటా. శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం ఎంత అణచివేసినా మేం వెనుకడుగు వేయమని కోటంరెడ్డి అన్నారు.