Vizag, July 7; ఏపీకి త్వరలో ఐటీ రాజధాని కానున్న విశాఖపట్నంలో రహేజా గ్రూప్ ఓ భారీ షాపింగ్ మాల్‌ను నిర్మించనుందని వార్తలు వస్తున్నాయి. 17 ఎకరాల్లో ఇనార్బిట్ మాల్ పేరిట రహేజా సంస్థ (Raheja Group) ఈ భారీ మాల్‌ను నిర్మించనుందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. అనధికార సోర్స్ ప్రకారం.. దీనికి సంబంధించి ప్రాథమిక ఒప్పందాలు ఇప్పటికే పూర్తి కాగా... త్వరలోనే మాల్ నిర్మాణ పనులను రహేజా మొదలుపెట్టనుంది. నగరంలోని విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం సాలిగ్రామపురంలో ఉన్న నౌకాశ్రయ గెస్ట్ హౌస్‌ల స్థలంలో ఈ మాల్ నిర్మాణం కానుంది.
నౌకాశ్రయానికి చెందిన గెస్ట్ హౌస్‌లు ఇప్పటికే శిథిలావస్థకు చేరుకోగా... వాటిని అధికారులు తొలగించారు. ఇనార్బిట్ మాల్స్ (Inorbit Malls) పేరిట రహేజా గ్రూప్ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీ మాల్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విశాఖలోనూ భారీ మాల్ ఏర్పాటుకు ఆసక్తి చూపిన రహేజా... నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించింది. ఈ క్రమంలో నౌకాశ్రయానికి చెందిన 17 ఎకరాల స్థలం మాల్ ఏర్పాటుకు (Inorbit Mall) అనుకూలంగా ఉంటుందని గుర్తించింది. ఆ వెంటనే నౌకాశ్రయ అధికారులతో చర్చలు జరిపిన రహేజా... ఆ స్థలాన్ని 30 ఏళ్ల లీజుకు తీసుకుంది. ఇందుకు గాను నైకాశ్రయం నిర్దేశించిన రూ.125 కోట్లను రహేజా చెల్లించింది.
ఇదిలా ఉంటే...నౌకాశ్రయానికి చెందిన స్థలం లీజు ద్వారా సంస్థకు భారీగా ఆదాయం సమకూరిందని నౌకాశ్రయ చైర్మన్ రామమోహన్ రావు తెలిపారు. 30 ఏళ్ల లీజు ముగిసిన తర్వాత స్థలంతో పాటు అందులోని నిర్మాణాలను కూడా రహేజా తమకు అప్పగించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అయితే 30 ఏళ్ల లీజు తర్వాత కూడా మాల్‌ను నిర్వహించాలనుకుంటే...రహేజాకు తొలి ప్రాధాన్యం ఇస్తామని, అప్పుడు స్థలానికి ఉన్న డిమాండ్, నిర్మాణాల విలువ ఆధారంగా లీజు రేటును నిర్ధారిస్తామని ఆయన చెప్పారు.