Andhra Pradesh Rains: ఏపీలో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు, చెట్ల కింద ఎవరూ ఉండవద్దని వాతావరణ శాఖ హెచ్చరిక, పలు జిల్లాలను నేడు పలకరించిన వర్షాలు
Rains (Credits: Pixabay)

ఎండ వేడిమితో అల్లాడిన తెలుగు రాష్ట్రాల ప్రజలను మంగళవారం వర్షం పలకరించింది. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రి సహా వివిధ ప్రాంతాలు నీట మునిగాయి. అన్నవరం, రాజమండ్రి వంటి ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. పిఠాపురం, అమలాపురం తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, అల్లూరి, చిత్తూరు, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అదే సమయంలో సత్యసాయి, విజయనగరం, ప్రకాశం, మన్యం, కాకినాడ, వైఎస్సార్ కడప, అనకాపల్లి, అనంతపురం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు. వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల గంటకు పైగా వర్షం, రహదారులు జలమయం, పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌

ఉరుములతో కూడి వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు, రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని రోణంకి కూర్మనాథ్ వివరించారు. కాగా, ఇవాళ ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిశాయని వెల్లడించారు. సాయంత్రం 6 గంటల సమయానికి తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో 124.5 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా మండపేటలో 120.5, రాజమండ్రిలో 92, కోనసీమ జిల్లా తాటపూడిలో 75.5, ఏలూరు జిల్లా నూజివీడులో 73.5, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూర్మనాథ్ తెలిపారు.