Amaravati, June 8: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అటు సంక్షేమంతో పాటు ఇటు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారనడానికి జీడీపీ గణాంకాలే నిదర్శనమని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (Industries Minister Goutham Reddy) పేర్కొన్నారు. 2020–21లో దేశ జీడీపీ (ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకోకుండా) 2.97 శాతం క్షీణిస్తే మన రాష్ట్రంలో 1.58 శాతం వృద్ధి (Andhra Pradesh Records 1.58% Growth Rate) నమోదైందని ఆయన గుర్తు చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తైన సందర్భంగా మంగళవారం ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి మేకపాటి విలేకరులతో మాట్లాడారు.
నవరత్నాల పథకాల వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోవిడ్ సంక్షోభాన్ని తట్టుకొని నిలబడటమే కాకుండా పాజిటివ్ వృద్ధి రేటు నమోదు చేసిందని చెప్పారు. 24 నెలల కాలంలో 18 నెలలుగా కోవిడ్‌తో పోరాడుతున్నప్పటికీ పెట్టుబడుల ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చడంలో తెలంగాణ, తమిళనాడు కంటే మన రాష్ట్రం మెరుగ్గా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గణాంకాలే దీనికి నిదర్శనమని, 2019 నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రాజెక్టులు వాస్తవ రూపంలోకి వచ్చాయని వివరించారు.
2019లో రూ.34,696 కోట్లు, 2020లో రూ.9,840 కోట్లు, 2021(జనవరి, ఫిబ్రవరి)లో రూ.1,039 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయని మేకపాటి తెలిపారు. ఎటువంటి ఒప్పందాల హడావుడి, ప్రచారాలు లేకుండా నేరుగా పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు. గోల్డ్ ప్లస్ గ్లాస్ సెంచూరీ ఫ్లై, నీల్ కమల్ లాంటి ఫరి్నచర్ కంపెనీలు, జపాన్‌కు చెందిన భారీ టైర్ల తయారీ సంస్థ ఏటీజీ ఇలా పలు కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు.
గత రెండేళ్లలో రూ.34,002 కోట్ల విలువైన ప్రాజెక్టులు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాయని, వీటి ద్వారా 1,30,565 మందికి ఉపాధి లభించిందన్నారు. ఇందులో 65 భారీ, మెగా ప్రాజెక్టులు కాగా 13,885 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉన్నాయని చెప్పారు. రూ.1,32,784 కోట్ల విలువైన 67 భారీ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, వీటి ద్వారా 1,56,616 మందికి ఉపాధి లభించనుందన్నారు. ఇవికాకుండా రూ.1,43,906 కోట్ల విలువైన 67 ప్రాజెక్టులకు సంబంధించి చర్చలు చురుగ్గా జరుగుతున్నట్లు తెలిపారు. ఇవి కార్యరూపం దాల్చడం ద్వారా 1,56,169 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పారు. దేశ వాణిజ్య ఎగుమతుల్లో 16.8 బిలియన్ డాలర్లతో రాష్ట్రం 5.8 శాతం వాటాను కలిగి ఉందని, దీన్ని 2030 నాటికి 10 శాతానికి చేర్చడం ద్వారా 33.7 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
మూడు పారిశ్రామిక కారిడార్లలో పారిశ్రామిక పార్కులు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్‌పోర్టులు, ఐటీ కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నిక్‌డిక్ట్ నిధులతో కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ, వైఎస్‌ఆర్ కడప జిల్లా కొప్పర్తిలో మెగా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ఆర్ ఈఎంసీ పనులు వేగంగా జరుగుతున్నాయని, రూ.7,000 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2023 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు.
రీస్టార్ట్ ప్యాకేజీ కింద రూ.1,110 కోట్లు ఇచ్చామని, ఈ ఏడాది టెక్స్‌టైల్ రంగానికి చెందిన కంపెనీలకు ఆగస్టులో రాయితీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి’ పేరుతో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహిస్తూ సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రమణ్యం, ఐటీ శాఖ కార్యదర్శి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.