COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరింత తగ్గిన కోవిడ్ వ్యాప్తి, పాజిటివ్ రేటు 13 శాతానికి తగ్గుదల, రాష్ట్రంలో కొత్తగా 11,421 పాజిటివ్ కేసులు నమోదు, 16 వేలకు పైగా రికవరీ
నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 16,223 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 15,78,452 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,38,912 ఆక్టివ్ కేసులు...
Amaravathi, June 3: ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ కోవిడ్ పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. రోజూవారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో నిన్నటికంటే ఈరోజు వెయ్యికి పైగా కేసులు తక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ రేటు 25% నుండి 13% కు తగ్గిందని ఆరోగ్య శాఖ పేర్కొంది.
మరోవైపు, రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. కరోనావైరస్ యొక్క థర్డ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి వచ్చే మూడు నెలల కాలానికి ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేశారో తెలపాల్సిందిగా ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. థర్డ్ వేవ్ కరోనాను ఎదుర్కొనేందుకు పలు సూచనలు కూడా హైకోర్ట్ చేసింది. వైద్య సిబ్బంది కొరత లేకుండా ఎంబిబిఎస్ పరీక్షలు రాసిన వారిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 86,223 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 11,421 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 17,28,577కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 17,25,682గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 2,308 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లా నుంచి 1,658, అలాగే అనంతపూర్ జిల్లా నుంచి 1,041 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 81 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 11,213కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 16,223 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 15,78,452 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,38,912 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Jun 03, 2021 05:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

