Amaravati, August 22: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. మొన్నటి వరకు 10 వేల లోపు నమోదైన పాజిటివ్ కేసులు నేడు మరోసారి ఆ మార్కును దాటింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 10,276 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3,45,216 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 3,42,321 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఉభయ గోదావరి జిల్లాల నుంచే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1321 కేసులు, అలాగే పశ్చిమ గోదావరి నుంచి 1033 కేసులు నిర్ధారించబడ్డాయి. ఇక చిత్తూరు జిల్లా నుంచి 1220, అనంతపూర్ జిల్లా నుంచి 1020 పాజిటివ్ కేసులు, మరియు నెల్లూరు జిల్లా నుంచి 943 కేసుల చొప్పున రికార్డ్ అయ్యాయి.. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Report:
గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా మరో 97 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 3,189 కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 8,593 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2,52,638 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 89,389 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
గడిచిన ఒక్కరోజులో 61,469 మంది శాంపుల్స్ పరీక్షించినట్లు తెలిపింది. ఈరోజు వరకు సుమారుగా 31,91,326 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.