COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10,199 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 4 లక్షల 65 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 4200కు పెరిగిన కరోనా మరణాలు
Coronavirus Outbreak in AP | PTI Photo

Amaravati, September 3:  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఎంతకీ తగ్గడం లేదు, గత వారం రోజులుగా కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్యలో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు.  రాష్ట్రంలో వరుసగా 8వ రోజు 10 వేలకు పైబడి కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.   గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 10,199 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,65,730కు చేరింది.  అయితే  ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 4,62,835 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా తీవ్రత బీభత్సంగా ఉంది. ఈ జిల్లా నుంచి ప్రతిరోజు వెయ్యికి తక్కువ కాకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే ఇక్కడ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే అత్యధికంగా 1090 కేసులు నమోదయ్యాయి.

అలాగే నెల్లూరు, ప్రకాశం  జిల్లాల్లో కూడా వెయ్యికి దగ్గరగా పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా మరో 75 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 4,200కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 9,499 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 3,57,829 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,03,701 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో  62,225 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు సుమారుగా  39,05,775 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.