Amaravathi, June 07: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 199 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,659 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 3718 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 17,695 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో కొత్తగా మరో 2 కరోనా మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా నుంచి ఒకరు మరియు కర్నూల్ జిల్లా నుంచి ఒకరు చొప్పున కోవిడ్ బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజా మరణాలతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 75కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 30 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2353 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1290 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
AP COVID19 Report:
లాక్డౌన్ ఆంక్షలు సడలించటం వల్ల ఇతర ప్రాంతాల నుంచి భారీగా రాష్ట్రానికి తరలి వస్తున్నారు. వీరి సంఖ్యను అధికారులు విడిగా చూపుతున్నారు. గత 24 గంటల్లో నమోదైన మొత్తం 199 కేసుల్లో 130 ఏపి పరిధిలోనివి కాగా, మిగిలిన 69 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి. ఇలా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 810 మందికి వైరస్ నిర్ధారణ కాగా, ప్రస్తుతం వీరిలో 508 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 131 మందికి పాజిటివ్ అని తేలగా, ప్రస్తుతం 127 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.